Begin typing your search above and press return to search.

ఊరట: కేంద్రంతో చర్చలకు రైతుల ఓకే

By:  Tupaki Desk   |   26 Dec 2020 2:00 PM GMT
ఊరట: కేంద్రంతో చర్చలకు రైతుల ఓకే
X
దాదాపు నెలరోజులకు పైగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న రైతుల ఆందోళనపై ఎట్టకేలకు ఓ పరిష్కారం దొరకబోతోందనే ఆశ వచ్చింది. రైతు సంఘాలు తాజాగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు అంగీకరించాయి.

డిసెంబర్ 29న ఉదయం 11 గంటలకు చర్చలకు వస్తామని రైతుసంఘాలు వెల్లడించాయి. నాలుగు అంశాల ఎజెండాతో కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ కు రైతు సంఘాలు లేఖలు పంపాయి.

రైతులు లేఖలో ప్రతిపాదనలు పొందుపరిచారు. మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులపై చర్చించలనేది చర్చల్లో మొదటి అంశం కాగా.. అన్ని రకాల పంటలకు జాతీయ రైతు కమిషన్ సూచించిన లాభదాయకమైన మద్దతు ధరకు చట్ట బద్దత కల్పించడం రెండోది.ఢిల్లీ పరిసర ప్రాంతాలలో వాయు నాణ్యత నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఆర్డినెన్స్‌కు సవరణలు చేయాలని.. ఆర్డినెన్స్ శిక్షా నిబంధనల నుండి రైతులను మినహాయించాలని మూడో అజెండాగా చేర్చారు. ఇక..రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ‘విద్యుత్ సవరణ బిల్లు 2020’ ముసాయిదాలో అవసరమైన మార్పులు చేయడంపై చర్చించాలనేది నాలుగో అజెండాగా రైతులు లేఖలో పేర్కొన్నారు.

కేంద్రం పట్టువిడుపులతో రావాలని.. చర్చలు జరపడానికి తాము సిద్ధమని రైతు సంఘాలు లేఖలో పేర్కొన్నాయి. వాస్తవాలు దాచిపెట్టి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. నిజంగా రైతుల సమస్యలు పరిష్కరించాలంటే రైతుల డిమాండ్లను ఆపార్థం చేసుకోవద్దని రైతు సంఘాలు సూచించాయి. రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న ప్రచారం మొదట ఆపాలని కేంద్రాన్ని రైతు సంఘాలు కోరాయి.