రైతు ఆత్మహత్యయత్నం..ఏపీలో సెల్ఫీ వీడియో కలకలం

Sun May 24 2020 17:38:04 GMT+0530 (IST)

farmer suicide in east godavari mulagapudi

అధికార పార్టీ నాయకుడి తీరుపై విసుగు చెందిన రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు సెల్ఫీ వీడియో తీసుకోవడంతో ఆ వీడియో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కలవరం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా రౌతుల పూడి మండలం ములగపూడిలో గుడివాడ అప్పల నాయుడు స్థలంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తంగేటి శివ గణేశ్ సెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నాడు. అయితే దీనిపై రైతు అప్పలనాయుడు పోరాడుతున్నాడు. ఈ విషయంలో కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు.అయినా కోర్టు స్టే ఉన్న సమయంలో శివ వర్గం పనులు ప్రారంభించాడు. దీంతో పనులు అడ్డుకోబోయాడు. ఈ సమయంలో అతడిపై దాడి జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కూడా న్యాయం జరగకపోవడంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కూడా తనను శారీరకంగా హింసించడంతో మనస్తాపానికి లోనయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసిన కోటనందురు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఆత్మహత్యకు పాల్పడే ముందు రైతు అప్పలనాయుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోలో కొంతమంది నాయకులు - పోలీసులు వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆరోపించాడు. ఈ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు అది వైరలైంది. అతడి ఆత్మహత్య సమాచారం తెలియడంతో పోలీసులు ఏలేరు కాలువ సమీపంలో గాలించారు. అక్కడ అప్పల నాయుడు బైక్ - సూసైడ్ నోట్ లభ్యమయ్యాయి. శంఖవరం మండలం అచ్చంపేట గ్రామంలో ఏలేరు కాలువ పక్కన అప్పలనాయుడు విగతజీవిగా కనిపించాడు. దీంతో వెంటనే అతడిని రౌతులపూడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.