Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఇంటి ముందు సూసైడ్ అటెంప్ట్‌

By:  Tupaki Desk   |   11 April 2018 5:19 AM GMT
కేసీఆర్ ఇంటి ముందు సూసైడ్ అటెంప్ట్‌
X
తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ప్ర‌తి చిన్న ఘ‌ట‌న‌కు పెద్ద‌గా రెస్పాండ్ అయ్యేవారు కేసీఆర్‌. టీఆర్ ఎస్ అధినేత‌గా ఉన్న వేళ తెలంగాణ‌కు చెందిన ప్ర‌తిఒక్క‌రి గోష తీర్చ‌ట‌మే త‌న క‌ర్త‌వ్య‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్‌.. అదే తెలంగాణ‌కు ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత మాత్రం తెలంగాణ ప్ర‌జ‌లు ప‌ట్ట‌టం లేద‌న్న ఆరోప‌ణ‌ల్ని ఎదుర్కొంటున్నారు.

త‌న రాజ్యంలో క‌ష్టాలు లేనే లేవ‌ని. బంగారు తెలంగాణ దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు ప‌డుతున్నాయంటూ ఉప‌న్యాసాలు ఇచ్చే కేసీఆర్‌.. వాస్త‌వంలో ఎలాంటి ప‌రిస్థితులు ఉన్నాయ‌న్న విష‌యాన్ని పట్టించుకోవ‌టం లేద‌న్న విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తోంది. రైతుల కోసం భారీగా సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు చెప్ప‌టంతో పాటు.. రుణ‌మాఫీతో తెలంగాణ రైతుల ముఖాల్లో సంతోషాన్ని పండేలా చేశాన‌ని గొప్ప‌లు చెప్ప‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. వ‌రుస‌గా వ‌స్తున్న పంట న‌ష్టంతో ఆగ‌మాగం అయిపోతున్న రైతు ఒక‌రు త‌న బాధ చెప్పుకోవ‌టానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను క‌లిసే ప్ర‌య‌త్నం చేశారు.

ఒక సామాన్య రైతు ముఖ్య‌మంత్రిని క‌లిసి త‌న క‌ష్టాల గురించి చెప్పుకోవ‌టానికి ఛాన్స్ ఉందా? అంటే ఉండ‌ద‌నే చెప్పాలి. అందులోకి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లాంటి నేత‌ను క‌లుసుకోవ‌టం అంత తేలికైన ముచ్చ‌ట కాదు. తోపుల్లాంటి నేత‌ల‌కు.. ప్ర‌ముఖుల‌కు సైతం త‌న అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు ఇష్ట‌ప‌డ‌ని కేసీఆర్‌.. ఒక సాదాసీదా రైతు కోసం.. అత‌డు చెప్పే క‌ష్టాల్ని వినేందుకు ఒప్పుకుంటారా అంటే డౌటే.

నిజానికి ఒక పేద రైతు త‌న‌ను క‌లుసుకోవ‌టానికి త‌న ఇంటి ముందుకు వ‌చ్చార‌న్న విష‌యం కేసీఆర్ కు స‌మాచారం చేర‌వేసే వాళ్లు ఎవ‌రు? అన్న‌ది ప్ర‌శ్న‌. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గ‌తంలో మాదిరి ముఖ్య‌మంత్రులు ప్ర‌జాద‌ర్బార్ ఏర్పాటు చేయ‌టం ఒక క్ర‌మ‌ప‌ద్ద‌తిలో ఉండేది. కానీ.. కేసీఆర్ హ‌యాంలో అలాంటివి ఎప్పుడో ఒక‌సారి త‌ప్పించి రెగ్యుల‌ర్ గా ఉండ‌ని ప‌రిస్థితి.

ఇలాంటి ప‌రిస్థితుల్లో కేసీఆర్ ను క‌లిసేందుకు వ‌చ్చిన ఒక యువ‌రైతు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకున్న వైనం సంచ‌ల‌నంగా మారింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండ‌లం పుష్పాల‌గూడ గ్రామానికి చెందిన 24 ఏళ్ల సైదులు 11 ఎక‌రాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. వ‌రి పంట వేశాడు. పంట‌కు నీరు లేక‌పోవ‌టంతో పెట్టిన పెట్టుబ‌డి సైతం చేతికి రాని ప‌రిస్థితి. దీని కోసం చేసిన అప్పులు.. వ‌డ్డీలు క‌లిపి రూ.9ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి.

దీంతో.. త‌న ఆర్థిక క‌ష్టాల్ని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ‌దామ‌న్న ఉద్దేశంతో సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు. అక్క‌డ సీఎంను క‌లిసేందుకు అధికారులు అనుమ‌తించ‌లేదు. దీంతో మ‌న‌స్తాపానికి గురైన అత‌డు.. త‌న‌తో తెచ్చుకున్న పురుగుల మందును తాగేసి అప‌స్మార‌క స్థితిలో ప‌డిపోయాడు. ఈ వైనాన్ని గుర్తించిన పోలీసులు 108 ద్వారా గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం స‌ద‌రు రైతు ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని.. 24 గంట‌ల పాటు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండాల‌ని వెల్ల‌డించారు. ఒక సాదాసీదా రైతు త‌న క‌ష్టాల్ని ముఖ్య‌మంత్రికి చెప్పుకోటానికి రాగానే.. అత‌డ్ని పిలిచి స‌మ‌స్య‌లు వినే ప‌రిస్థితి సీఎంకు లేక‌పోవ‌చ్చు. కానీ.. అలాంటోళ్ల‌కు.. వారి న‌మ్మ‌కం పెరిగేలా.. క‌ష్టంలో ఉన్న వారికి సీఎం అప‌న్న‌హ‌స్తం ఉంటుంద‌న్న భావ‌న వ‌చ్చేలా ఏదైనా కార్య‌క్ర‌మాన్ని చేప‌డితే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.