Begin typing your search above and press return to search.

ఏపీలో భూసేక‌ర‌ణ నిరసిస్తూ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

By:  Tupaki Desk   |   25 Sep 2015 9:49 AM GMT
ఏపీలో భూసేక‌ర‌ణ నిరసిస్తూ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌
X
ఏపీలో భూసేక‌ర‌ణ‌పై నిర‌స‌న‌లు పెరుగుతున్నాయి. తాజాగా భూసేక‌ర‌ణ నిరసిస్తూ కృష్ణా జిల్లాలో ఓ రైతు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది. నిన్న‌టి వ‌ర‌కు ఏపీ రాజ‌ధాని ప్రాంత‌మైన అమ‌రావ‌తిలో భూసేక‌ర‌ణ నిర‌సిస్తూ రైతులు ఆందోళ‌న చేప‌డితే ఇప్పుడు రాజ‌ధాని ప్రాంత‌మైన‌ కృష్ణా జిల్లాలో బంద‌రు పోర్టుకు భూసేక‌ర‌ణ నిరసిస్తూ ఆందోళ‌న‌ల‌కు దిగారు. గ‌తంలో ప్ర‌భుత్వం కేటాయించిన భూమి క‌న్నా ఎక్కువుగా భూసేక‌ర‌ణ చేస్తుండ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్న రైతులు కొద్ది రోజులుగా అక్క‌డ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేస్తున్నారు.

అక్క‌డ ప్ర‌భుత్వ దూత‌లుగా వెళ్లిన మంత్రి కొల్లు ర‌వీంద్ర‌తో పాటు బంద‌రు ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌ను సైతం రైతులు రెండుమూడుసార్లు నిర్భంధించారు. తాజాగా శుక్ర‌వారం పోర్టు భూసేకరణను వ్యతిరేకిస్తూ వెంకటేశ్వరరావు అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెడన మండలం కాకర్లపూడిలో ఈ సంఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

నిన్న‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో క‌రెంటు కోత‌ల‌తో రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటే ఇప్పుడు ఏపీ వంతు వ‌చ్చింది. ఏపీలో ప్ర‌కాశం జిల్లాలో పొగాకు పంట‌కు స‌రైన గిట్టుబాటు ధ‌ర‌లేక‌పోవ‌డంతో పాటు, మిగిలిన పొగాకును ప్ర‌భుత్వం కొనుగోలు చేయ‌క‌పోవ‌డంతో ఇద్ద‌రు రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో అప్పుల బాధ‌లు త‌ట్టుకోలేక రైతులు చ‌నిపోతుంటే ఇప్పుడు భూసేక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా రైతులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డ‌డం ప్ర‌భుత్వానికి పెద్ద ఇబ్బందిగా ప‌రిణ‌మించింది. కొద్ది రోజుల క్రితం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దేవ‌ర‌పల్లి మండ‌లంలో ఓ పొగాకు రైతు ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు రాసిన లేఖ కూడా సంచ‌ల‌నం రేపింది.

సీఎం భ‌ద్ర‌త కోసం రూ.5.5 కోట్ల‌తో బుల్లెట్ ప్రూప్ బ‌స్ కొన్నార‌ని..అయితే రైతుల జీవితానికి ఎలాంటి భ‌ద్ర‌త లేకుండా పోయింద‌ని రైతు త‌న సూసైడ్ నోట్‌ లో పేర్కొన్నాడు. ఏపీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా స్పందించి బ‌ల‌వంత‌పు భూసేక‌ర‌ణ‌కు బ‌దులుగా రైతుల‌కు ఆమోద‌యోగ్య‌మైన ప్యాకేజీలు, ఇత‌ర‌త్రా హామీలు ఇవ్వ‌డం ద్వారా భూసేక‌ర‌ణ జ‌రిపితే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.