Begin typing your search above and press return to search.

సెన్సేష‌న్‌: పాల‌మ్మే రైతు.. హెలికాప్ట‌ర్ కొన్నాడు..!

By:  Tupaki Desk   |   17 Feb 2021 6:00 AM IST
సెన్సేష‌న్‌: పాల‌మ్మే రైతు.. హెలికాప్ట‌ర్ కొన్నాడు..!
X
పాల‌మ్మే రైతులు అనేక క‌ష్టాల్లో ఉన్నార‌ని.. మ‌నం నిత్యం ఏదో ఒక మూల వింటూనే ఉంటాం. పాడి రైతు ల క‌ష్టాలు ఎప్పుడూ.. వార్త‌లుగా వ‌స్తూనే ఉంటాయి. అయితే.. ఇదే పాల వ్యాపారంలో మూడు పువ్వులు ఆరు కాయ‌లు అన్న‌ట్టుగా లాభాలు ఆర్జించ‌డ‌మే కాకుండా.. ఉన్న‌త‌శ్రేణి వ్యాపార‌వేత్త‌గా ఎదిగారు.. అంతేకాదు..కేవ‌లం ఆదాని, అంబానీల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన సొంత హెలికాప్ట‌ర్‌ను కొనుగోలు చేశారు. ఆయ‌నే..‌ మ‌హారాష్ట్ర‌కు చెందిన జ‌నార్ద‌న్ బోయ‌ర్ అనే పాడి రైతు! చిత్రంగా ఉన్న ఈ విష‌యం. ఇప్పుడు దేశం మొత్తాన్ని విశేషంగా ఆక‌ట్టుకోవ‌డం గ‌మ‌నార్హం.

మహారాష్ట్రలోని బివండీకి చెందిన జనార్ధన్ బోయిర్ పాడి రైతు. తన పాల వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణంయించుకున్నారు. అయితే, వ్యాపారం మొత్తం తాను ఒక్కడే చూసుకోవడం వల్ల తన గ్రామం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు సమయం బాగా వృథా అవుతోంది. ఆయన సందర్శించే కొన్ని ప్రాంతాలకు రైలు, విమాన సర్వీసులు లేకపోవడంతో రోడ్డు మార్గంలో ప్రయాణాలు చేయడం కష్టంగా మారింది. దీంతో ఆయన స్నేహితుడు ఇచ్చిన సలహాతో .. రూ.30 కోట్లు వెచ్చించి హెలికాప్టర్ కొనేశారు.

పాల వ్యాపారంతోపాటు బిల్డర్‌గానూ జ‌నార్ద‌న్ లాభ‌సాటి బిజినెస్ చేస్తున్నారు. త‌న వ్యాపారాల‌ను పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్‌లకు విస్త‌రించారు. ఈ క్ర‌మంలోనే ఆయా ప్రాంతాల‌కు విమానాల్లో చేరుకోవడం, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గమ్యానికి చేరడానికి ఇటీవ‌ల కాలంలో ఆయ‌న‌కు ఒకింత ఇబ్బందిగా మారింది. ఈ నేప‌థ్యంలోనే హెలికాప్టర్ కొనుగోలు చేయడం ఒక్కటే సరైన మార్గమని భావించారు. ఇటీవ‌ల ఆయ‌న కొనుగోలు చేసిన హెలికాప్ట‌ర్‌ ఆదివారం జనార్ధన్ చెంత‌కుచేరుకుంది.

ఈ సందర్భంగా జనార్ధన్ గ్రామ పంచాయతీ సభ్యులతో హెలికాప్టర్లో చక్కర్లు కొట్టారు. ఇక‌, ఈ హెలికాప్ట‌ర్ దిగ‌డం కోసం.. 2.5 ఎకరాల స్థలంలో హెలిప్యాడ్ నిర్మిస్తున్నాడు. హెలికాప్టర్‌ను పెట్టేందుకు ప్రత్యేక గ్యారేజ్, పైలట్ రూమ్, టెక్నీషియన్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. జనార్థన్ వ్యవసాయం, పాల ఉత్పత్తులు, స్థిరాస్థి వ్యాపారంతోనే రూ.100 కోట్లు విలువైన ఆస్తులను సంపాదించడం గమనార్హం.మొత్తంగా ఒక ప‌క్కా ప్రణాళిక‌తో ముందుకు సాగితే.. ఎంత ఎత్త‌యినా.. ఎద‌గ‌డం.. సాధ్య‌మేన‌ని నిరూపించారు జ‌నార్ద‌న్‌.