Begin typing your search above and press return to search.

దేశంలోనే తొలి నీటి దొంగతనం కేసు

By:  Tupaki Desk   |   8 May 2016 6:28 AM GMT
దేశంలోనే తొలి నీటి దొంగతనం కేసు
X
బంగారం - డబ్బు - వాహనాలు దొంగతనాలు నిత్యం జరుగుతుంటాయి.. వాటిపై పోలీసు కేసులు నమోదవుతుంటాయి. ఇవి కాకుండా పంటలు - విలువైన పత్రాలు - వస్తువులు.. ఇలా ఎన్నో రకాల దొంగతనాలు జరుగుతుంటాయి. కానీ.. నీటిని దొంగలించారని కేసు పెట్టడం మాత్రం ఇంతవరకు లేనేలేదు. అది కూడా ప్రభుత్వ అధికారులు ఒక రైతుపై ఇలాంటి నేరం మోపుతూ కేసు పెట్టడం ఇదే తొలిసారని చెబుతున్నారు. బలవంతంగా నీటిని తరలించుకుపోయారని... దొమ్మీకి పాల్పడ్డారని కొన్నిచోట్ల నాయకులపై కేసులుపెట్టిన సందర్భాలున్నాయి కానీ నీటిని దొంగతనంగా ఎత్తుకెళ్లారన్న ఆరోపణలు మాత్రం లేనేలేవు. కానీ... ఉత్తరప్రదేశ్ లో తీవ్రమైన నీటి కొరతతో ఇబ్బందిపడుతున్న బుందేల్ ఖండ్ ప్రాంతంలో ఇలా నీటి దొంగతనం కేసు నమోదైంది. నీటిని దొంగతనం చేశాడంటూ ఏకంగా ఒక రైతును అరెస్టు చేయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది.

ఉత్తర ప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలోని మహోబీలో 55 ఏళ్ల రైతు ఊర్మిల్ డ్యాం నుంచి నీటిని చోరీ చేసి తన పొలానికి మళ్లించుకున్నాడని కేసుపెట్టి అరెస్టు చేశారు. డ్యామ్ కు చెందిన ఒక వాల్వ్ ను పగుల గొట్టి చిన్న కాలువ ద్వారా నీటిని తన పొలానికి మళ్లించుకున్నాడన్నది హరిలాల్ అనే ఆ రైతుపై పెట్టిన కేసు. అయితే హరిలాల్ కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఆరోపణను ఖండిస్తున్నారు. డ్యాం వాల్వ్ ఎప్పుడో పగిలిపోయిందనీ, అక్కడి నుంచి వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవడానికి హీరాలాల్ చిన్న కాలువ ద్వారా తన పొలానికి మళ్లించాడని చెబుతున్నారు. ఇరిగేషన్ అధికారులు డ్యాం పగిలిపోయిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి హరిలాల్ పై నేరం మోపి ఇరికించారని ఆరోపిస్తున్నారు.

కాగా బుందేల్ ఖండ్ లో తాగునీటికి కూడా తీవ్ర కొరత ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల అక్కడకు కేంద్రం నీటి రైలును పంపగా యూపీ సీఎం దాన్ని తిప్పిపంపడం వివాదాస్పదమైంది. తాజాగా డ్యాంల నుంచి నీరు వేస్టవుతుండడం వంటి నిర్లక్ష్యాలు బయటపడుతుండడంతో వాటిని కవర్ చేసుకునేందుకు ఇలా తప్పుడు కేసులు పెడుతున్నట్లుగా తెలుస్తోంది.