Begin typing your search above and press return to search.

గాయాలకు మందు రాస్తున్న ఐపీఎల్

By:  Tupaki Desk   |   22 Sept 2020 9:30 AM IST
గాయాలకు మందు రాస్తున్న ఐపీఎల్
X
ప్ర‌తి సారీ కొత్త ఏడాది మీద ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటాం. గ‌తం ఎలా ఉన్నా కొత్త ఏడాదిలో అంతా మంచే జ‌రుగుతుంద‌ని ఆశిస్తాం. ఐతే కొత్త సంవ‌త్స‌రం కొంద‌రికి అంతా మంచే జ‌రుగుతుంది. కొంద‌రికి చెడు జ‌రుగుతుంది. కానీ ప్ర‌పంచవ్యాప్తంగా వంద‌ల కోట్ల మందిని వేద‌న‌కు గురి చేసిన సంవ‌త్స‌రంగా 2020 చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది.

ఈ ఏడాది క‌రోనా దెబ్బ‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో దేశాలు అన్ని ర‌కాలుగా కుదేల‌య్యాయి. భార‌త్ ప‌రిస్థితి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. బ‌హుశా క‌రోనా వ‌ల్ల అత్య‌ధికంగా న‌ష్టం చ‌విచూసిన దేశం భారతే కావ‌చ్చు. ఎడ‌తెగ‌ని క‌రోనా క‌ష్టాల‌తో మ‌న జనం అల్లాడిపోయారు. మార్చిలో లాక్‌డౌన్ మొద‌ల‌య్యాక మంచి వార్త అన్న‌దే లేకుండా పోయింది. ఆరోగ్యాలు దెబ్బ తిన్నాయి. ఆర్థిక న‌ష్టం వాటిల్లింది. అన్ని ర‌కాల వినోదాలూ దూర‌మ‌య్యాయి.

జ‌నాలు తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయిన స్థితిలో ఐపీఎల్ వ‌చ్చి గ‌త ఆరు నెల‌ల గాయాల‌కు కొంచెం మందు వేస్తోంది. భార‌తీయ యువ‌త‌కు సినిమా, క్రికెట్ అత్యంత ఇష్ట‌మైన వ్యాప‌కాలు. థియేట‌ర్ల‌లో సినిమాలు, స్టేడియాల్లో లైవ్ మ్యాచ్‌లను వాళ్లు పూర్తిగా మిస్స‌యిపోయారు. థియేట‌ర్ల‌లో సినిమాలపై ఇప్పుడే ఆశ‌లు పెట్టుకునే ప‌రిస్థితి లేదు. కానీ క్రికెట్ లైవ్ వినోదం మాత్రం ఎట్ట‌కేల‌కు ఆరంభ‌మైంది. ఎన్నో ఆశ‌లు, అంచ‌నాల మ‌ధ్య మొద‌లైన ఐపీఎల్‌.. అదిరిపోయే రీతిలో ఆరంభ‌మైంది.

ముంబ‌యి, చెన్నై మ‌ధ్య తొలి మ్యాచ్ హోరాహోరీగా సాగి అల‌రిస్తే.. పంజాబ్‌, ఢిల్లీ మ‌ధ్య త‌ర్వాతి మ్యాచ్ అయితే ఉత్కంఠ‌తో ఊపేసింది. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా ట్రెండ్స్ గ‌మ‌నిస్తే.. ఎటు చూసినా ఐపీఎల్ ముచ్చ‌ట్లే క‌నిపిస్తున్నాయి. సాయంత్రం అయితే టీవీలు, మొబైళ్ల‌లో ఐపీఎలే క‌నిపిస్తోంది. దీన్ని బ‌ట్టి చూస్తే వ‌చ్చే నెల‌న్న‌ర రోజులు జ‌నాలు ఐపీఎల్ మ‌త్తులో మునిగిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.