Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు గుడి కట్టిన వీరాభిమాని.. ఇప్పుడు వైరల్ వార్తగా ఎందుకు మారాడు?

By:  Tupaki Desk   |   13 Jan 2021 9:19 AM IST
కేసీఆర్ కు గుడి కట్టిన వీరాభిమాని.. ఇప్పుడు వైరల్ వార్తగా ఎందుకు మారాడు?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పిచ్చి పిచ్చిగా ప్రేమించి..అభిమానించే వారికి కొదవ లేదు. అదే సమయంలో ఆయన్ను తీవ్రంగా తప్పు పడుతూ.. ఆయన చేసే పనులు.. తీసుకునే నిర్ణయాల్ని చీల్చి చెండాడే వారికి కొదవ లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పాలరాతితో కేసీఆర్ కు గుడి కట్టిన ఒక వీరాభిమాని తాజాగా పార్టీకి రాజీనామా చేసిన వైనం సంచలనంగానూ.. వైరల్ వార్తగా మారింది.

కేసీఆర్ మీద విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శించే తెలంగాణ ఉద్యమకారుడు గుండ రవీందర్ తాజాగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదన్నది ఆయన ఆరోపణ. కేసీఆర్ ను కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా.. ఆయన్ను కలవలేకపోయినట్లుగా వెల్లడించారు.

మంచిర్యాల జిల్లాకు చెందిన రవీందర్ కు కేసీఆర్ అంటే పిచ్చి అభిమానం. ఇందులో భాగంగా 2016లో ఆయన కేసీఆర్ కు పాలరాతితో గుడి కట్టించారు. తరచూ కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసే వారు కూడా. టీఆర్ఎస్ లో చురుగ్గా పాల్గొనే అతను తన ఇంటి ఆవరణలోనే గుడి కట్టుకున్నారు.

అసాధ్యమనుకున్న తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ పై రవీందర్ కు ఉన్న అభిమానంఅంతా ఇంతా కాదు. తాను కట్టిన గుడికి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించినా రాలేదు. దీంతో.. తనకు తానే ప్రారంభించుకున్నారు. ఉద్యమకారులకు సరైన ప్రాధాన్యత లభించకపోవటంతో.. కేసీఆర్ విగ్రహానికి తన పార్టీ రాజీనామా లేఖను ఇచ్చారు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. గుడి కట్టినప్పుడు కేసీఆర్ కంట్లో పడ్డారో లేదో కానీ ఇప్పుడైనా ఆయన వరకు వీరాభిమాని రాజీనామా వ్యవహరం వెళుతుందో లేదో చూడాలి.