Begin typing your search above and press return to search.

టీడీపీ 'కుటుంబ పోరు' ఇంతింతకాదయా..

By:  Tupaki Desk   |   4 Nov 2018 7:37 AM GMT
టీడీపీ కుటుంబ పోరు ఇంతింతకాదయా..
X
ఎన్నికల్లో వర్గ పోరు సహజం. ఒకే పార్టీలో టిక్కెట్ కోసం పోటీ పడే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉన్నా - చివరికి వరించేంది ఒకరికే. కానీ, ఒకే కుటుంబంలో తల్లీ - కూతురు - అన్న - బావ - మరదలు తమకు టిక్కెట్ కావాలంటే తమకు కావాలని అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో జరుగుతున్న ఈ పరిణామాలు వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్న ఆసక్తికరంగానూ ఉన్నాయి.

కుటుంబ పోరు ఇంటి వరకే పరిమితమైతే ఫర్వాలేదు. రచ్చకెక్కి తల్లి - కూతురు వేర్వేరుగా సమీక్షలు - సమావేశాలు నిర్వహిస్తుండటం టీడీపీ కార్యకర్తలు కూడా అయోమయానికి గురవుతున్నారు. ఏపీలోని శింగనమల అసెంబ్లీ నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. తల్లి ఎమ్మెల్సీ శమంతకమణి కాగా - కూతురు ఎమ్మెల్యే యామినీ బాల. తల్లి రాజకీయ వారసత్వంతో ఆమె గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందింది. ప్రస్తుతం అసెంబ్లీ విప్ గా కొనసాగుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా - తల్లి వారసత్వాన్ని ఈ సారి కొడుకు కోరుకోవడం రచ్చకు కారణమైంది. ఓవైపు ఎమ్మెల్సీ శమంతకమణి - మరో వైపు ఎమ్మెల్యే యామినీ బాల పోటాపోటీగా సమీక్షలు నిర్వహించేసుకుంటున్నారు. సోదరుడికి ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదని - తనే పోటీలో ఉంటానని యామినీ బాల స్పష్టం చేస్తున్నారు. ఈ పంచాయితీ చంద్రబాబు వద్దకు చేరింది. ఆయన ఎవరి వైపు మొగ్గు చూపకపోకయినా - వచ్చే ఎన్నికల్లో తమకే టిక్కెట్టు దక్కుతుందని తల్లి - కొడుకు - కూతుళ్లు వేర్వేరుగా ప్రచారం చేసుకుంటున్నారు.

ఇక, నగరి నియోజకవర్గంలోనూ కుటుంబ పోరు ఓ రేంజ్ లో కొనసాగుతుంది. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన ఓడిపోయిన గాలి ముద్ద కృష్ణమనాయుడు మరణంతో - ఇద్దరు కొడుకుల మధ్య లుకలుకలు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ సీటు విషయంలో ఓ రేంజ్ లో తలపడ్డారు. చివరకు చంద్రబాబు కృష్ణమ నాయుడు భార్యకు ఎమ్మెల్సీ ఇచ్చి తాత్కాలికంగా పోరును చల్లార్చారు. మరలా వచ్చే ఎన్నికల్లో ఎవరికీ టిక్కెట్ ఇవ్వాలనే అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇద్దరికీ లేదని మూడో వ్యక్తికి కేటాయింపు జరుగుతుందంటూ ప్రచారం జరగడంతో - వారిద్దరు తాత్కాలికంగా సైలెంట్ అయినట్లు కనబడుతున్నారు.

అలాగే, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోనూ టీడీపీలో కుటుంబ పోరు కనిపిస్తుంది. ఇటీవల టీడీపీలో చేరిన అమర్ నాథ్ రెడ్డి అక్కడ నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అందుకు బ్రేక్ వేస్తూ ఆయన మరదలికి ఇన్ చార్జి పోస్టును అప్పగించారు. దీంతో అక్కడ కూడా కుటుంబ రాజకీయాలు వీధికెక్కి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే - చంద్రబాబుకు లేని పరువు పార్టీకి కూడా లేకుండా పోతుంది.