Begin typing your search above and press return to search.

ఒకే వైద్యుడు.. 7 గంటల్లో 101 మంది మహిళలకు ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ.. విచారణ

By:  Tupaki Desk   |   5 Sept 2021 8:00 AM IST
ఒకే వైద్యుడు.. 7 గంటల్లో 101 మంది మహిళలకు ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ.. విచారణ
X
ఒక డాక్టర్ చేసిన అత్యుత్సాహం వివాదానికి దారితీసింది. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుర్గుజా జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యుడు ఏడు గంటల్లోనే ఏకంగా 101 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం పెద్ద దుమారం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నిబంధనలకు విరుద్ధంగా ఒక వైద్యుడు ఒకే రోజు ఇన్ని ఆపరేషన్లు చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది.

సుర్గుజా జిల్లాలోని మైన్ పట్ లో ఉన్న నర్మదాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆగస్టు 27న ప్రభుత్వం కుటుంబ నియంత్రణ శస్త్రచకిత్స శిబిరం నిర్వహించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ జరిగిన ఈ క్యాంపులో ప్రభుత్వ వైద్యుడు డా.జిబ్నస్ ఎక్కా ఏకంగా 101 మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశాడు.

ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఒకే వైద్యుడు ఇన్ని ఆపరేషన్లు చేయడంపై వైద్యశాఖకు ఫిర్యాదులు అందాయి. ఒకే రోజులో ఒక వైద్యుడు 30 ఆపరేషన్లు మాత్రమే చేయాలి.. ఇక్కడ మూడు రెట్లు చేయడంపై వివాదం చెలరేగింది.

దీనిపై ఆపరేషన్లు చేసిన డా.జిబ్నస్ స్పందించాడు. ప్రభుత్వ నిబంధనలు తనకు తెలుసన్నారు. అయితే ఆరోజు క్యాంపుకు ఎక్కడెక్కడి నుంచో మహిళలు వచ్చాయని సూదూర ప్రాంతాల నుంచి వచ్చామని.. మళ్లీ రాలేమని కోరడంతో అలా ఆపరేషన్ చేశానని.. వారి ఒత్తిడి మేరకే చేశానని వివరణ ఇచ్చాడు.

దీనిపై జిల్లా వైద్యాధికారి తాజాగా వైద్యుడికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి విచారణకు ఆదేశించారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. ఇదివరకు చత్తీస్ ఘడ్ లో ఇలానే ఆపరేషన్లు చేస్తే 83మంది మహిళలు అనారోగ్యానికి గురై 13 మంది చనిపోయారు. అందుకే ప్రభుత్వం దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యింది.