Begin typing your search above and press return to search.

వైర‌స్ బాధితుడి మృత‌దేహం ఎత్తుకెళ్లిన కుటుంబ‌స‌భ్యులు!

By:  Tupaki Desk   |   18 Jun 2020 9:30 PM IST
వైర‌స్ బాధితుడి మృత‌దేహం ఎత్తుకెళ్లిన కుటుంబ‌స‌భ్యులు!
X
మ‌హ‌మ్మారి వైర‌స్ తీవ్రంగా ప్ర‌బ‌లుతోంది. ఈ క్ర‌మంలో భ‌యాందోళ‌న‌లు స‌ర్వ‌త్రా ఏర్ప‌డింది. అంద‌రూ భ‌యంభ‌యంతో బ‌తుకుతున్నారు. ప‌రిస్థితి ఇలా ఉంటే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మాత్రం ఈ వైర‌స్‌ను గాలికొదిలేశారు. లాక్‌డౌన్ విధించ‌డం ఆపేసి అన్‌లాక్‌ను ద‌శ‌ల‌వారీగా అమ‌లుచేసేందుకు ప్ర‌భుత్వం ముంద‌డుగు వేస్తోంది. దీంతో ప్ర‌జ‌లు వైర‌స్‌తో స‌హ‌జీవ‌నం త‌ప్ప‌క చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇలాంటి భ‌యంతో ఓ కుటుంబం సినిమాలో చేసిన‌ట్టు చేశారు. దీంతో ఢిల్లీలో క‌ల‌వ‌రం రేపింది.

ఢిల్లీలో వైర‌స్ తీవ్రంగా వ్యాపిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి వైర‌స్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌కి చెందిన వ్యక్తి జూన్ 1వ తేదీన వైర‌స్‌తో సర్ గంగారాం ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం (జూన్ 17) మృతిచెందాడు. అతడికి ఐటీఓ సమీపంలోని ఓ శ్మశానంలో ఖననం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో బయటికి వెళ్లిన మృతదేహం ఎంతసేపటికీ శ్మశానానికి చేరుకోలేదు.

దారి మధ్యలోనే మృతుడికి సంబంధించిన దాదాపు 30 మంది కుటుంబసభ్యులు బలవంతంగా మరో అంబులెన్స్‌లో మృతదేహాన్ని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. వైర‌స్‌తో మృతిచెంద‌డంతో అత‌డి మృత‌దేహాన్ని చూపించ‌క‌పోవ‌డం.. కుటుంబ‌స‌భ్యుల‌కు దూరంగా ఉంచ‌డం వంటివి చేస్తుండ‌డంతో వారు మృత‌దేహం ఎత్తుకెళ్లారు. ఈ విష‌యం తెలుసుకున్న అధికారులు షాక్‌కు గుర‌య్యారు. వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలంటూ అధికారులు పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో కొన్ని కిలోమీటర్ల తర్వాత జిల్లా అధికారులు ఫోన్ ద్వారా కుటుంబీకులను సంప్రదించారు. మృతదేహాన్ని వెనక్కి తీసుకురావాలంటూ హెచ్చరించడంతో బాధితుడి బంధువులు విధిలేక అధికారుల వ‌ద్ద‌కు వ‌చ్చారు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అనంత‌రం ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం బుధవారం అర్థరాత్రి దాటాక పోలీసుల సమక్షంలో మృతదేహాన్ని ఖననం చేశారు.