Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో మస్తు వైరస్ పోస్టు సైతం పులిహోరే బాసూ

By:  Tupaki Desk   |   28 April 2020 10:30 AM IST
సోషల్ మీడియాలో మస్తు వైరస్ పోస్టు సైతం పులిహోరే బాసూ
X
మీడియా కథనాలు చేసే కన్ఫ్యూజన్ సరిపోదన్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పోస్టుల్లో చాలావరకూ పులిహోరే అన్న నానుడికి బలం చేకూర్చే పోస్టు ఉదంతంగా దీన్ని చెప్పాలి. నిజాన్ని నిజంగా చెప్పటం కంటే.. అబద్ధాన్ని నిజంగా నిజమన్నట్లుగా క్రియేట్ చేసే ఫేక్ పోస్టులు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. ఎవరికి తోచినట్లుగా వారు వండి వార్చే కథనాల పుణ్యమా అని జరుగుతున్న డ్యామేజ్ అంతా ఇంతా కాదు. గడిచిన వారంలో ఒక పోస్టు సోషల్ మీడియాలో మస్తు వైరల్ గా మారింది.

జపాన్ కు చెందిన నోబుల్ ప్రైజ్ విన్నర్ ప్రొఫెసర్ టసుకు హోంజో చేసినట్లుగా చెప్పే ఒక పోస్టు వైరల్ గా మారింది. దాని సారాంశం ఏమంటే.. కరోనా వైరస్ అన్నది చైనా ల్యాబుల్లో పుట్టిందని.. ఈ విషయంలో మరో మాటకు తావు లేదని.. తాను చనిపోయిన తర్వాతైనా తాను చెప్పింది నిజమని తేలుతుందన్నారు. ఒకవేళ.. తాను చెప్పింది అబద్ధమని తేలితే.. తనకిచ్చిన నోబెల్ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవచ్చన్నారు.

తాను నలభై ఏళ్లుగా జంతువులపైనా.. వైరస్ పైనా అధ్యయనం చేశానని.. కోవిడ్ 19 వైరస్ సహజంగా లేదని.. దాని తీరంతా కృత్రిమంగా ఉన్నట్లుగా ఆయన పేరిట వైరల్ గా మారిన పోస్టు పేర్కొంది. అంతేకాదు.. తనకు వూహాన్ లోని ల్యాబ్ లో పని చేసే వారితో మంచి సంబంధాలు ఉన్నాయని.. గడిచిన మూడు నెలలుగా వారికి తాను ఫోన్ చేస్తే ఎత్తటం లేదని.. దీన్ని చూస్తే.. ల్యాబ్ లో పని చేసినోళ్లంతా మరణించి ఉంటారని ఆయన పేర్కొన్నట్లుగా ఒక పోస్టు వైరల్ గా మారింది.

తన పేరుతో వైరల్ అవుతున్న మెసేజ్ పచ్చి అబద్ధమని ఆయనే స్వయంగా పేర్కొన్నారు. ప్రస్తుతం జపాన్ లోని క్యోటో వర్సిటీలో విధులు నిర్వహిస్తున్న ఆయన వద్ద పని చేస్తున్న అలోక్ కుమార్.. మరో పీహెచ్ డీ విద్యార్థి స్పందించారు. హోంజో ఎప్పుడూ తన జీవితంలో వుహాన్ ల్యాబ్ లో పని చేయలేదని.. ఆ మాటకు వస్తే వైరస్ ల మీద ఆయన పరిశోధనలు చేయలేదని వారు చెబుతున్నారు. ఆయన పేరుతో వచ్చిన పోస్టు అంతా అబద్ధంగా తేల్చేశారు. అందుకే అంటారు.. తెల్లగా ఉన్నవన్నీ పాలు కావు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులన్ని నిజం కావని. అర్థమవుతోందా?