Begin typing your search above and press return to search.

కూకట్ పల్లి లక్ష ఓట్లకు పైనే తీసేశారంట

By:  Tupaki Desk   |   20 Sep 2015 4:18 AM GMT
కూకట్ పల్లి లక్ష ఓట్లకు పైనే తీసేశారంట
X
తెలంగాణ రాష్ట్ర సర్కారుకు సరికొత్త తలనొప్పి మొదలైనట్లే. ఓ పక్క గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఓట్ల తొలగింపు ఇప్పుడు మంట పుట్టిస్తోంది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున ఓట్ల తొలగింపు కార్యక్రమం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. విపక్షాలు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం ఇప్పుడు వేడి పుట్టిస్తోంది.

గ్రేటర్ పరిధిలోని ఒక్క కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే దాదాపుగా 1.21 లక్షల ఓట్లు తొలిగించారన్న వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. సీమాంధ్రులు అత్యధికంగా ఉండే కూకట్ పల్లి నియోజకవర్గం కొరుకుడుపడనిదిగా మారింది. ఈ నియోజకవర్గంలో తమ పట్టు పెంచుకోవాలని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఏదో విధంగా కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో గులాబీనేతలు ఉన్నట్లు చెబుతారు. అందులో భాగంగా గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఓట్ల తొలగింపు కార్యక్రమం ఒకటన్న విమర్శ వినిపిస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గ్రేటర్ పరిధిలోని 18 సర్కిళ్లలో మొత్తంగా 4.77లక్షల ఓట్లు తొలగిస్తే.. ఇందులో 1.21 లక్షలు కేవలం కూకట్ పల్లి సర్కిల్ లో ఉండటం గమనార్హం. తాము బలంగా ఉన్న ప్రాంతాల్లో.. తమను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు వీలుగా.. ఓట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టినట్లుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లే తాజా తొలగింపు ఉందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా ఓట్ల తొలగింపు కార్యక్రమం రాజకీయ వేడిని మరింత పెంచటం ఖాయమంటున్నారు. మరి.. ఈ భారీ ఓట్ల తొలగింపుపై తెలంగాణ అధికారపక్షం ఏం చెబుతుందో చూడాలి.