Begin typing your search above and press return to search.

మెడలో కార్డు వేసుకుంటే 'కరోనాకు' గుడ్ బాయ్ !..సరి కొత్త దందా షురూ!

By:  Tupaki Desk   |   7 Sep 2020 1:30 PM GMT
మెడలో కార్డు వేసుకుంటే కరోనాకు గుడ్ బాయ్ !..సరి కొత్త దందా షురూ!
X
కరోనా పేరు చెబితే చాలు జనం వణికిపోతున్నారు. అది సోకకుండా ఉండేందుకు రకరకాల మందులు, కషాయాలు తాగుతున్నారు. ఎవరు ఏం చెప్తే అది తింటున్నారు. చివరికి జీర్ణం కాక అల్లాడుతున్నారు. మాస్కులు ధరించి బయటకు వెళ్తున్నారు. మనిషికి మనిషికి మధ్య దూరం పాటిస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా కరోనాను తరిమికొట్టే పరికరం అందుబాటులోకి వచ్చింది. అయితే అది పని చేస్తుందా.. చెయ్యదా.. అని జనం ఆలోచించడం లేదు. దాని కోసం క్యూలు కట్టి కొనుగోలు చేస్తున్నారు. చివరికి మోసపోతున్నారు. కరోనా వ్యాధి నివారణకు కొత్తగా మార్కెట్లోకి కరోనా ( షట్ ఔట్ ) కార్డులు వచ్చాయి. అవి చూడడానికి ఐడీ కార్డులా ఉంటాయి. అవి మెడలో వేసుకుంటే కరోనా రాదని అందరూ దాని కొనుగోలుకు బారులు తీరుతున్నారు.

మూడు నెలల ఎక్స్ పైరీ డేట్ ఉండే కార్డును మార్కెట్లో రూ. 200 నుంచి, రూ. 400 వరకూ విక్రయిస్తున్నారు. ఆన్లైన్లో ఈ కామర్స్ వెబ్సైట్ లలో కూడా ఈ కరోనా కార్డులను విక్రయిస్తున్నారు. నెల ఎక్స్ పైరీ డేట్ ఉండే కార్డు రూ. 60కి అమ్ముతున్నారు. అయితే వైద్యులు మాత్రం కరోనా కార్డులు చెత్త బుట్టలో వేసేందుకు కూడా పనికిరావు అని అంటున్నారు. ' నిజంగా ఇది పెద్ద మోసం. ఇలాంటి కార్డులేవి కరోనాను ఎదుర్కో లేవు. మెడలో కార్డు వేసుకుంటే కరోనా రాదని చెప్పి మోసగిస్తున్నారు' అని ఆర్. కె. సిన్హా అనే వైద్య నిపుణుడు పేర్కొన్నారు. ప్రభుత్వం జనాన్ని మోసగించే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని కోరారు. ' ఇలాంటి కార్డులను శ్వాసకోశ సమస్యలకు సంబంధించి పరిష్కారం కోసం ఉపయోగిస్తుంటారు. ఈ కార్డులు వైరస్ ను చంపలేవు. ఈ కార్డుల్లో క్లోరిన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇది శ్వాసకోశ వ్యవస్థకు హానికరమైనది. క్లోరిన్ ఆక్సైడ్ కు చర్మాన్ని కొరికే గుణం ఉంటుంది. దీనివల్ల చర్మం దెబ్బతినడమే కాకుండా, కంటి సమస్యలు శాస్త్ర సంబంధ సమస్యలు తలెత్తుతుంటాయి. ఇంతటి అపాయకరమైన కార్డులను జనం కరోనా నిరోధక సాధనంగా వినియోగిస్తుండటంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.