Begin typing your search above and press return to search.

చదివింది ఐదు కానీ 'డాక్టర్' ..ఏకంగా పోలీసులకే !

By:  Tupaki Desk   |   12 Sept 2020 12:00 PM IST
చదివింది ఐదు కానీ డాక్టర్ ..ఏకంగా పోలీసులకే !
X

అదేదో సినిమాలో 5 రూపాయల లేస్ ప్యాకెట్ కావాలని రూపాయి ఇచ్చి ఓ పిల్లవాడు అడిగితే , షాప్ అతను రాదు అంటాడు. ఎందుకు రాదు అలా లాగు వస్తుంది అని పిల్లాడు చెప్తాడు. దీనితో ఆ షాప్ అతను షాక్ అవుతాడు. లాగితే ఐదు రూపాయల ప్యాకెట్ కూడా రూపాయికే వచ్చినట్టు ..ఐదు చదివిన ఓ వ్యక్తి ఏకంగా నేను ఎందుకు డాక్టర్ కాకూడదు అనుకోని డాక్టర్ అవతారం ఎత్తాడు. ఐదు వరకే చదివినా కూడా సూటు, బూటు వేసుకుని పెద్ద డాక్టర్‌గా చలామణీ అవుతూ వచ్చాడు. ఎన్నో ప్రముఖ హాస్పిటల్స్‌ లో నకిలీ సర్టిఫికెట్స్‌ తో పని చేసి ఏకంగా రాచకొండ పోలీసులనే బురిడీ కొట్టించాడు సీనియర్‌ పోలీసు అధికారులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి.. కరోనా బారిన పడిన పోలీస్‌ సిబ్బందికి వైద్యం అందించాడు. ఆఖరికి రౌడీషీట్‌ ఎత్తేయిస్తానంటూ రూ.5 లక్షలు వసూలు చేయడంతో ఈ నకిలీ డాక్టర్‌పై పోలీసులకు అనుమానమొచ్చి, వివరాలు సేకరిస్తే అసలు విషయం బయటకి వచ్చింది.

నకిలీ వైద్యుడిగా చలామణీ అవుతున్న తేజారెడ్డి, ఒంగోలులోని గీతాంజలి కన్సల్టెన్సీ నిర్వాహకుడు బోకూడి శ్రీనివాస్ ‌రావు, వైఎస్‌ తేజ తండ్రి వీరగంధం వెంకటరావు లను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేయగా.. వీరి నుంచి 21 రకాల నకిలీ ధ్రువీకరణ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఆరుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు.హైదరాబాద్ లోని అనేక కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యుడిగా పని చేసిన తేజారెడ్డి.. ఫిబ్రవరి 2020 వరకు వైద్య శిబిరాలు నిర్వహించాడు. లాక్ ‌డౌన్‌ మొదలైన తర్వాత క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఔషధాలను అందజేశాడు. రాచకొండ కోవిడ్‌ కంట్రోల్ ‌రూంలో వాలంటీర్ ‌గా చేరాడు. కరోనా బారిన పడిన సిబ్బందికి వైద్యం చేశాడు. అంతేకాదు ఆసుపత్రుల్లో పని చేసేటప్పుడు ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులతో పరిచయం పెంచుకునేవాడు. తాను ఏపీ సీఎం జగన్ ‌కు చుట్టమంటూ ఎంతోమందికి టోపీ పెట్టి రూ. 15 లక్షల రుణం ఎగ్గొట్టాడు.

ఇక , మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఈ ఏడాది జూలైలో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యను కూడా వేధింపులకు గురి చేయడంతో ఆమె కేసు పెట్టింది. ఆ సమయంలో రౌడీ షీటర్ ‌కు చెందిన వాహనానికి ప్రభుత్వం వాహనం అని స్టిక్కర్‌ వేయించుకుని తిరిగాడు. దీనితో పోలీసులకు అనుమానమొచ్చి ఆరా తీయగా మొత్తం గుట్టంతా బయటపడింది. కాగా, ఈ నకిలీ డాక్టర్ బెంగళూరులో కూడా ఇదే తరహా మోసం చేసినట్లు తెలుస్తోంది. నకిలీ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో సాయపడిన మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అతని నుంచి 21 రకాల నకిలీ ధ్రువీకరణ పత్రాలు, రూ. 4.70 లక్షలు, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.