Begin typing your search above and press return to search.

మీ డాక్టర్ ఒరిజినలేనా? షాకింగ్ గా మారిన నివేదిక

By:  Tupaki Desk   |   28 Sep 2021 3:21 AM GMT
మీ డాక్టర్ ఒరిజినలేనా? షాకింగ్ గా మారిన నివేదిక
X
విన్నంతనే ఉలిక్కిపడే విషయానికి సంబంధించిన నివేదిక ఒకటి వెల్లడైంది. అందులో పేర్కొన్న అంశాల్ని చూస్తే నోట మాట రాకపోవటమే కాదు.. ప్రతి ఒక్కరు తాము వెళ్లే వైద్యుడి డిటైల్స్ ను మరోసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందన్న విషయాన్ని తెలియజేసేలా ఉందన్న మాట వినిపిస్తోంది. అర్హత లేకుండానే వైద్యులుగా చలామణీ అయ్యే వారికి కొదవ లేదు. ఇలాంటి రియల్ మున్నాభాయ్ లు అంతకంతకూ ఎక్కువ అవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నెత్తి నోరు కొట్టుకుంటోంది.

సదరు సంస్థకు చెందిన ‘హెల్త్‌ వర్క్‌ఫోర్స్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో ఒక నివేదికను సిద్ధం చేశారు. తాజాగా విడుదలైన సదరు నివేదికలో పలు షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. భారత దేశంలో వైద్యులుగా చెలామణీ అయ్యే వారిలో 17.9 శాతం నకిలీలుగా తేల్చారు. రాష్ట్రాల వారీగా కూడా సమాచారాన్ని సేకరించారు. దీని ప్రకారం చూస్తే.. జాతీయ సగటుతో పోలిస్తే.. తెలంగాణలో 19.08 శాతం మంది గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎలాంటి వైద్య పట్టా లేకుండానే వైద్యం చేస్తున్నట్లుగా గుర్తించినట్లుగా పేర్కొంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. గుర్తింపు లేని వైద్యుల సంఖ్య ఇంత ఎక్కువగా ఉంటే.. అర్హత లేని నర్సుల సంఖ్య ఏకంగా 58 శాతం ఉన్నట్లు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వైద్యుల్లో 3.52 వాతం మంది తెలంగాణలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి పది వేల మంది జనాభాకు 7.3 మంది వైద్యులు.. 13.8 శాతం మంది నర్సులు ఉన్నారు. తెలంగాణలోని వైద్యుల్లో 67 శాతం మంది పురుషులు అయితే.. 33 శాతం మహిళలుగా ఉన్నారు. అదే సమయంలో వైద్య పట్టా ఉన్న వారిలో 67 శాతం మంది ప్రాక్టీస్ చేస్తుంటే.. ఏడు శాతం మంది వైద్య నిరుద్యోగులుగా ఉన్నారు. మరో 27 శాతం మంది ఛాన్సులు ఉండి మరీ ఖాళీగా ఉంటున్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 27,600 మంది అల్లోపతి వైద్యులు ఉంటే.. 52,500 మంది నర్సులు ఉన్నారు. ఆయుష్ (ఆయుర్వేదం) వైద్యులు 12,800 మంది ఉంటే.. డెంటల్ డాక్టర్లు 6700 మంది ఉన్నారు. వీరిలో 30-40 మధ్యన ఉన్న వైద్యులు 73 శాతం అయితే.. 41-50ఏళ్ల మధ్య ఉన్న వారు 18.5 శాతం ఉన్నారు. నర్సుల్లో 15-29 ఏళ్ల మధ్య ఉన్న వారు 25.4 శాతం ఉంటే.. 30-40 ఏళ్ల మధ్య ఉన్న వారు 31.5 శాతం మంది 41-50 ఏళ్ల మధ్యన ఉన్న వారు 43 శాతం మంది ఉండటం గమనార్హం.

వైద్యుల్లో 35 శాతం మంది గ్రామీణ ప్రాంతా్లో చేస్తుంటే.. 58 శాతం మంది పట్టణాల్లో చేస్తున్నారు. నర్సుల విషయానికి వస్తే 42 శాతం పల్లెల్లో.. 58 శాతం పట్టణాల్లో ఉన్నారు. మొత్తంక వైద్యుల్లో 86 శాతం డాక్టర్లు ప్రైవేటు ఆసుపత్రుల్లో కానీ.. సొంతంగా కానీ క్లినిక్ కలిగి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో దాదాపు ఐదో వంతు వైద్యులు.. అర్హత లేనివాళ్లుగా చెబుతున్నారు. వీరిలో ప్రైవేటు ప్రాక్టీస్ చేసే వారే అధికం. ఇలాంటి నకిలీలు అల్లోపతిలోనే కాదు.. ఆయుష్ వైద్యులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఎందుకైనా మంచిది మీరు వెళ్లే వైద్యుడు మాత్రమే కాదు.. ఊళ్లో ఉండే మీ వాళ్లు వెళ్లే వైద్యుడి హిస్టరీని ఒకసారి చెక్ చేయటం మంచిదన్న భావన.. ఈ నివేదికను చూసినంతనే కలుగక మానదు.