Begin typing your search above and press return to search.

యూట్యూబ్ చూస్తూ అబార్షన్.. తీగలాగితే డొంక కదిలింది!

By:  Tupaki Desk   |   27 March 2021 1:30 AM GMT
యూట్యూబ్ చూస్తూ అబార్షన్.. తీగలాగితే డొంక కదిలింది!
X
పెరిగిన సాంకేతికతో అభివృద్ధితో పాటు అనర్థాలు మెండుగా ఉన్నాయి. మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తూ డాక్టర్ అవతారమెత్తాడు ఓ యువకుడు. ఆడపిల్లలు వద్దనుకునేవారిని లక్ష్యంగా చేసుకొని క్రమంగా యూట్యూబ్ చూస్తూ అబార్షన్లు చేయడం మొదలుపెట్టాడు. తీగలాగితే డొంక కదిలినట్లు అధికారుల తనిఖీల్లో ఆ యువకుడి గుట్టు రట్టైంది. వరంగల్ నగరంలో అర్హత లేకున్నా యూట్యూబ్ వీడియోలు చూస్తే అబార్షన్లు చేస్తున్నాడనే సమాచారంతో అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేసి పట్టుకున్నారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేటకు చెందిన అండ్రు ఇంద్రారెడ్డి అనే యువకుడు నెల రోజుల కిందట హన్మకొండలోని ఏకశిలా పార్కు ఎదురుగా సిటీ హాస్పిటల్‌ పేరుతో ఓ ఆసుపత్రి ప్రారంభించారు. ఆడపిల్ల వద్దనుకునేవారిని ఆర్ఎంపీలు తీసుకురాగా లింగనిర్ధారణ చేసి అబార్షన్లు చేయడం మొదలుపెట్టాడని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రక్రియను నర్సింగ్ లో శిక్షణ పొందిన వారి సాయంతో యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ కొనసాగిస్తున్నారని వెల్లడించారు. దీనిపై సమాచారం అందడంతో బుధవారం అర్ధరాత్రి రెవెన్యూ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కలిసి ఆ ఆస్పత్రిపై దాడులు చేశామని తెలిపారు. ఆ సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళలకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని వివరించారు.

అధికారులను చూసి సిబ్బంది గోడదూకి పారిపోగా... చికిత్స పొందుతున్న మహిళను బాత్ రూంలో ఉంచారని వెల్లడించారు. కాగా సంబంధిత మహిళను ఆరా తీస్తే వివరాలు తెలియజేసిందని చెప్పారు. తీవ్ర రక్తస్రావమవుతున్న ఆ మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో ఇంద్రారెడ్డి ఓ ఆస్పత్రిని ఏర్పాటు చేయగా.. అధికారులు దానిని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ ఆస్పత్రిని సీజ్ చేసి నిందితునిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు.. ప్రస్తుతం అతడిని పోలీసుల అదుపులో ఉన్నట్లు ఓ ప్రముఖ దినపత్రికలో కథనం ప్రచురితమైంది.