Begin typing your search above and press return to search.

నకిలీ చలాన్ల స్కాం..ఏపీ సర్కారుకు మరక

By:  Tupaki Desk   |   15 Aug 2021 6:35 AM GMT
నకిలీ చలాన్ల స్కాం..ఏపీ సర్కారుకు మరక
X
ఏపీలో వెలుగు చూసిన నకిలీ చలాన్ల కుంభకోణం కలకలం రేపుతోంది. ఏపీ వ్యాప్తంగా సాగిన ఈ దందాకు సంబంధించిన కీలక భూమిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నకడప జిల్లాలోనే ఉందన్న వాదన ఇప్పుడు సంచలనంగా మారింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులే కేంద్రంగా సాగిన ఈ దందాలో కోట్లాది రూపాయిల మేర ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లిందన్న మాట వినిపిస్తోంది. ఈ స్కాం బయటకు వచ్చిన తర్వాత ఏపీ వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని దస్త్రాల్ని జల్లెడ పడుతున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం తొమ్మిది జిల్లాల్లో ఈ నకిలీ చలాన్ల కుంభకోణానికి సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు.

తాజాగా ఈ స్కాంకు సంబంధించిన వివరాల్ని ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ మీడియాకు వెల్లడించారు. ఈ కుంభకోణం వెలుగు చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 65 లక్షల డాక్యుమెంట్లు పరిశీలించగా.. అందులో 770 డాక్యుమెంట్లకు సంబంధించి మోసం జరిగినట్లు గుర్తించారు. వీటి ద్వారా రూ.5కోట్ల మేర నష్టం వాటిల్లిందని.. దీనికి సంబంధించి ఇప్పటివరకు రూ.1.37 కోట్ల మొత్తాన్ని రికవరీ చేసినట్లుగా చెబుతున్నారు. అవకతవకలు ఎక్కువగా కడప.. కృష్ణా జిల్లాల్లోనే ఉన్నాయని చెబుతున్నారు.

ఈ స్కాంకు సంబంధించి ఇప్పటివరకు పది మందిపై ఆరోపణలు వెల్లువెత్తగా.. ఆరుగురి సబ్రిజిస్ట్రార్ల పైన వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం ఉదంతంపై సీఐడీ విచారణ అవసరం లేదన్న మాట రజత్ భార్గవ్ చెబుతున్నారు. సాధారణ పోలీసులే ఈ కేసును డీల్ చేయగలరని ఆయన పేర్కొన్నారు. ఈ స్కాంకు అధికారపక్ష నేతలకు సంబంధాలు ఉన్నట్లుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ శాఖా మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ నేత కమ్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమమహేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి తన పదవికి రాజీనామా చేస్తే.. ఈ కుట్రకు సహకరించిన వారు బయటకు వస్తారని చెబుతున్నారు. గతంలో జరిగిన నకిలీ స్టాంపుల స్కాంను మించిపోతుందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఏపీ వ్యాప్తంగా మొత్తం 17సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ స్కాం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఇదే విషయాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ శేషగిరిబాబు చెబుతున్నారు. ఇప్పటివరకు లభించిన ఆధారాలతో రూ.5 కోట్ల మొత్తం పక్కదారి పట్టినట్లుగా తాము గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ కుంభకోణంలో ఆస్తులు రిజిస్ట్రేషన్లు అవుతాయి. వాటికి జత చేసిన రిజిస్ట్రేషన్ చలాన్లు మాత్రం నకిలీవిగా చెబుతున్నారు. చలానాలు లేకుండా సాగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన బాధ్యత ఆయా యజమానులదే అవుతుందని చెబుతున్నారు. ఈ ఉదంతం ఎక్కడి వరకు వెళుతుందన్నది ఉత్కంట వ్యక్తమవుతోంది.