Begin typing your search above and press return to search.

షాగీ: పాతికేళ్ల కాల్ సెంట‌ర్ క‌ప‌టి!

By:  Tupaki Desk   |   23 Dec 2018 6:57 AM GMT
షాగీ: పాతికేళ్ల కాల్ సెంట‌ర్ క‌ప‌టి!
X
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని నొయిడాలో గ‌త శుక్ర‌వారం పోలీసులు ఓ న‌కిలీ కాల్ సెంట‌ర్ గుట్టు ర‌ట్టు చేశారు. అందులోని ఉద్యోగులంతా అమెరిక‌న్ల‌కు ఫోన్లు చేసి హాలీడే ప్యాకేజీలు - ఆదాయ‌పు ప‌న్నుశాఖ దాడుల పేరు చెప్తూ భ‌య‌పెట్టి డ‌బ్బులు లాగుతున్న‌ట్లు గుర్తించారు. ఏకంగా 126 మందిని అరెస్టు చేశారు. ఈ వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది.

తాజాగా ఈ కాల్ సెంట‌ర్ కుంభ‌కోణానికి సంబంధించి అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ కాల్ సెంట‌ర్ సూత్ర‌ధారి సాగ‌ర్ ఠ‌క్క‌ర్ అలియాస్ షాగీ అని తేలింది. షాగీ ఎవ‌రో కాదు ఏళ్లుగా కాల్ సెంట‌ర్ కుంభ‌కోణాల‌కు పాల్ప‌డుతూ అత్యంత క‌ప‌టిగా పేరుగాంచిన భార‌తీయుడు. వ‌య‌సు కేవ‌లం పాతికేళ్లు. న‌లాస్పొరా ప్రాంతంలో పుట్టి పెరిగిన నిరుపేద‌. కంప్యూట‌ర్ సంబంధిత ప‌రిజ్ఞానాన్ని కాస్త త్వ‌ర‌గా ఒంట బ‌ట్టించుకున్న షాగీ 16 ఏళ్ల వ‌య‌సులోనే మోసాల దారిప‌ట్టాడు. అత‌డికి గురువు జ‌గ‌దీశ్ క‌నాని. జ‌గ‌దీశ్ దేశ విదేశాల్లోని కాల్ సెంట‌ర్ల‌లో ప‌నిచేశాడు. కానీ - వేత‌నంగా వ‌చ్చే డ‌బ్బుతో అత‌డు సంతృప్తి చెంద‌లేదు. న‌కిలీ కాల్ సెంట‌ర్ల‌తో బాగా ఆర్జించ‌వ‌చ్చున‌ని భావించాడు. ముంబ‌యి, ఎన్ సీఆర్ ప్రాంతాల్లో వాటిని ఏర్పాటుచేశాడు.

గురువు బాట‌లోనే షాగీ సాగాడు. థానేలో 9 న‌కిలీ కాల్ సెంట‌ర్లు స్థాపించాడు. అమెరికా, కెన‌డా పౌరుల‌ను ప్ర‌ధానంగా ల‌క్ష్యంగా చేసుకున్నాడు. హాలీడే ప్యాకేజీల పేరుతో వారిని మోస‌గించాడు. రెవెన్యూ శాఖ నుంచి ఫోన్ చేస్తున్న‌ట్లు పౌరుల‌ను షాగీ కాల్ సెంట‌ర్ ఉద్యోగులు న‌మ్మించేవారు. మీపై ప‌న్ను ఎగ‌వేత ఆరోప‌ణ‌లున్నాయ‌ని బెదిరించేవారు. వాళ్లు కాళ్ల‌బేరానికి వ‌చ్చి ఎంతోకొంత ముట్ట‌జెప్పేలా చేసేవారు. భార‌త్ లోనూ ఆదాయ‌పు పన్నుశాఖ అధికారుల పేర్లు చెప్పి వ‌సూళ్ల‌కు పాల్ప‌డేవారు. షాగీ రోజుకు ల‌క్ష డాల‌ర్ల ట‌ర్నోవ‌ర్ సాధించాడంటే అత‌డి మోసాలు ఎంత‌గా కొన‌సాగాయో అర్థం చేసుకోవ‌చ్చు.

2016లో థానేలోని షాగీ కాల్ సెంట‌ర్ల‌పై పోలీసులు దాడి చేయ‌గా అత‌డి లీల‌లు బ‌య‌ట‌పడ్డాయి. అప్ప‌ట్లో 630 మంది ఉద్యోగుల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచార‌ణ అనంత‌రం 197 మందిని అరెస్టు చేశారు. షాగీ దుబాయ్ కి పారిపోగా అత‌ణ్ని వెన‌క్కి ర‌ప్పించి పోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం బెయిలుపై అత‌డు విడుద‌ల‌య్యాడు. మ‌ళ్లీ విదేశాల‌కు చెక్కేశాడు. ప్ర‌స్తుతం షాగీ దుబాయ్ లో త‌ల‌దాచుకుంటున్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

థానేలో త‌న కుంభ‌కోణం బ‌య‌ట‌ప‌డ్డ‌ప్ప‌టికీ షాగీ వెన‌క్కి త‌గ్గ‌లేదు. ముంబ‌యి, నొయిడా, అహ్మ‌దాబాద్ న‌గ‌రాల్లో బోగ‌స్ కాల్ సెంట‌ర్లు పెట్టాడు. అమెరికాకూ వాటిని విస్త‌రించాడు. తాను విదేశాల్లో ఉంటూనే ఇక్క‌డ త‌న మ‌నుషుల‌తో వాటిని న‌డిపించాడు. నొయిడాలో తాజాగా అరెస్ట‌యిన ఉద్యోగులంతా త‌మ య‌జమాని షాగీనేన‌ని పోలీసుల‌ విచార‌ణ‌లో అంగీక‌రించారు. అమెరికాలోనూ షాగీ న‌కిలీ కాల్ సెంట‌ర్ ను పోలీసులు గుర్తించారు. 20 మంది ఉద్యోగుల‌ను అరెస్టు చేశారు. షాగీ స‌హా వారంద‌రిపై కేసు న‌మోదు చేశారు. ఇలా షాగీ ఇప్పుడు భార‌త్ తోపాటు అమెరికాకూ మోస్ట్ వాంటెడ్ గా మారాడు.