Begin typing your search above and press return to search.

వరదసాయం పేరుతో దోపిడీకి యత్నం

By:  Tupaki Desk   |   21 Aug 2018 4:24 PM IST
వరదసాయం పేరుతో దోపిడీకి యత్నం
X
దుర్మార్గులు - దుష్టులు - కేటుగాళ్లు.. వీళ్లని తిట్టడానికి కూడా మనకు పదాలు సరిపోవు. అంతలా అమానుషానికి పాల్పడుతున్నారు. కేరళలో ఇళ్లు - బట్టలు - తిండి కోల్పోయి సహాయక శిభిరాల్లో తిండికోసం బిక్కుబిక్కుమనుకుంటూ వరద బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. వీరికి సాయం చేయడానికి చాలా మంది స్పందిస్తున్నారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున విరాళాలు జమ చేస్తున్నారు. అయితే దీన్ని కూడా క్యాష్ చేసుకోవడానికి కొందరు కేటుగాళ్లు రెడీ అయ్యారు. కేరళ సీఎం డిస్ట్రబ్ రిలీఫ్ ఫండ్ పేరుతో నకిలీ బ్యాంకు ఖాతాను సృష్టించారు. కానీ కేరళ అధికారుల అప్రమత్తతతో ఈ నకిలీ బ్యాంకు ఖాతాను ఛేధించామని తాజాగా ఎస్.బీ.ఐ అధికారులు వెల్లడించారు.

కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ నిజమైన బ్యాంకు ఖాతా 67319948232 ఇది. సీఎం అధికారిక ట్విట్టర్ - ఫేస్ బుక్ పేజీల్లో ఇదే షేర్ చేశారు. కానీ కొందరు అక్రమార్కులు తమిళనాడులోని తిరుచిరాపల్లిలో బ్యాంకులో ఓ బ్యాంకు ఖాతాను సృష్టించి ఇదే కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీనిపై అధికారులు ఆరాతీసి బ్యాంకు అధికారులతో కలిసి తాజాగా దాన్ని బ్లాక్ చేశారు. అందులో మూడు వేలు మాత్రమే జమ అయ్యాయని తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశిస్తున్నామన్నారు.

కేరళ సీఎం ఆఫీస్ కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన ఇచ్చింది. నకిలీ ఖాతాలు - పోస్టర్లు - మోసపూరిత సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేవలం కేరళ సీఎం అధికారిక ఖాతాల్లోనే జమ చేయాలని కోరింది.