Begin typing your search above and press return to search.

అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ సిద్ధం

By:  Tupaki Desk   |   30 May 2020 11:30 AM GMT
అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ సిద్ధం
X
ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. కేసులు, మరణాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో దీనికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాత ఫార్మాసుటికల్ కంపెనీ ‘ఫైజర్’ సంచలన ప్రకటన చేసింది. కరోనా వ్యాక్సిన్ ను అక్టోబర్ చివరి నాటికి సిద్దం చేస్తామని ఆ కంపెనీ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా తెలిపారు.

జర్మన్ ఎంఆర్ఎన్ఏ బయో ఎంటెక్ కంపెనీ సహకారంతో కరోనా వ్యాక్సిన్ టీకా బీఎన్టీ162ను తయారు చేశామని.. అమెరికా, ఐరోపాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వారం ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మానుఫ్యాక్చరర్స్ & అసోసియేషన్స్ (ఐఎఫ్‌పిఎంఎ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని బౌర్లా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న టీకా కూడా చివరి దశల్లో ఉంది. అమెరికాలో కూడా జేఅండ్ జే కంపెనీ వ్యాక్సిన్ అభివృద్ధిలో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా వ్యాక్సిన్లు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం, క్లినికల్ ట్రయల్స్ లో కనీసం 10 సంస్థల టీకాలున్నాయి. ప్రీ-క్లినికల్ ట్రయల్స్ లో 115 సంస్థల టీకాలు ఉన్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం.. వీలైనంత ఎక్కువ వ్యాక్సిన్లను పరీక్షించి అవి పనిచేస్తాయో లేదో తెలుసుకోవాలని.. విజయావకాశాలను పెంచుకోవాలని.. టీకాలు విఫలమయ్యే వరకు పరీక్షించడం చాలా అవసరం అని తెలిపింది.

ఫైజర్ - బయోఎంటెక్ అభివృద్ధి చేసిన టీకా చివరిదశల్లో ఉంది.అందరికంటే ముందే ఇది వస్తుందని ఆ సంస్థ సీఈవో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల వ్యాక్సిన్ మోతాదులు ఉత్పత్తి చేసి అందిస్తామని ఆయన తెలిపారు.