Begin typing your search above and press return to search.

జేసీపై ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌...ఇద్ద‌రి అరెస్టు

By:  Tupaki Desk   |   24 Oct 2017 5:32 AM GMT
జేసీపై ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌...ఇద్ద‌రి అరెస్టు
X
సోష‌ల్ మీడియాను అధికార ప‌క్షాలు చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇటీవ‌లే తెలంగాణ సీఎం కేసీఆర్ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా కామెంట్ చేశాడ‌ని ఓ కండ‌క్ట‌ర్‌ కు షోకాజ్ నోటీసు జారీచేసిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ పొరుగు రాష్ట్రమైన ఏపీలో కూడా ఇలాంటి అధికార పార్టీ -సోష‌ల్ మీడియా వివాదం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. టీడీపీలో ఫైర్‌ బ్రాండ్ నాయ‌కుడిగా ముద్ర‌ప‌డిన అనంతపురం జిల్లా తాడిపత్రి శాసనసభ్యులు - ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి సోద‌రుడు జేసీ ప్రభాకర్‌ రెడ్డి మ‌రోమూరు అనూహ్య‌రీతిలో తెర‌మీద‌కు వ‌చ్చారు. ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ రెడ్డిపై ఫేస్‌ బుక్ - యూట్యూబ్‌ లో అనుచిత పోస్టులు పెట్టిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు తాడిప‌త్రి పట్టణ సిఐ భాస్కర్‌ రెడ్డి తెలిపారు.

సోమవారం రాత్రి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సీఐ భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ తాడిప‌త్రి ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారంపై త‌మ‌కు ఫిర్యాదు అందిందని తెలిపారు. జూటూరు పెద్దిరెడ్డి అనే వ్యక్తి న‌కిలీ ప్రొఫైల్‌ తో ఫేస్‌ బుక్‌ లో అకౌంట్ సృష్టించి ఎమ్మెల్యేపై విమ‌ర్శ‌లకు పాల్ప‌డ్డార‌ని తెలిపారు. తాడిపత్రికి చెందిన బండి రామాంజినేయులు - కనగానపల్లి మండలం మామిళ్ళపల్లికి చెందిన బిల్లె నరేంద్ర వైరల్ చేసేందుకు సహాయం చేశారని సీఐ వివ‌రించారు. అనుచిత వ్యాఖ్యలను వైరల్ చేసిన రామాంజనేయులు - నరేంద్రను అరెస్ట్ చేశామని - అడ్మిన్ జూటూరు పెద్దిరెడ్డిని త్వరలో పట్టుకుంటామన్నారు. జేసీ బ్రదర్స్‌పై ఫేస్‌ బుక్ - యూట్యూబ్ - వాట్సప్‌ లలో అనుచిత వ్యాఖ్యలు చేయడమే గాక వీడియోలను వైరల్ చేశారని తెలిపారు. ఈ నేప‌థ్యంలో తాము విచార‌ణ జ‌రిపి అరెస్టు చేసిన‌ట్లు వివ‌రించారు.