Begin typing your search above and press return to search.

క‌ర్నూలులో బంగారు నిక్షేపాల వెలికితీత.. మరో కేజీఎఫ్‌ !

By:  Tupaki Desk   |   7 Oct 2020 5:40 PM IST
క‌ర్నూలులో బంగారు నిక్షేపాల వెలికితీత.. మరో కేజీఎఫ్‌ !
X
కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాల వెలికితీత పనులు ప్రారంభమైయ్యాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని పగిడిరాయి, జొన్నగిరి గ్రామాల మధ్య డ్రిల్లింగ్‌ పనులను మంగళవారం జియో మైసూర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రారంభం చేసింది. తుగ్గలి మండలంలోని పగిడిరాయి, బొల్లవానిపల్లి, జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో 40 ఏళ్లుగా వివిధ కంపెనీలు సర్వేలు చేసి, బంగారం నిక్షేపాలున్నాయని గుర్తించాయి. దాదాపు 15 ఏళ్లుగా సర్వే చేస్తున్న జియో మైసూర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నిక్షేపాల వెలికితీతకు సిద్ధమైంది.

అలాగే , 2013లో ఈ వెలికితీత పనులు చేయడానికి ప్రభుత్వ అనుమతులు పొందింది. అయితే , నిక్షేపాల వెలికితీతపై కొందరు కోర్టుకు వెళ్లడంతో పనుల్లో జాప్యం ఏర్పడింది. గతేడాది ఎకరా రూ.12 లక్షలు చొప్పున 300 ఎకరాలు కొనుగోలు చేసి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, భూములు కోల్పోయే రైతులకు డబ్బులు చెల్లించడంలో ఆలస్యం జరగడం, కొన్నాళ్ల పాటు కంపెనీ ప్రతినిధులు మొహం చాటేయడంతో మైనింగ్‌ ప్రాజెక్టు కలగా మిగిలింది. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం కంపెనీ ప్రతినిధులు వచ్చి రైతులతో మాట్లాడి ఏడాది కౌలు చెల్లించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. డ్రిల్లింగ్‌ పనులు మొదలు పెట్టారు.