Begin typing your search above and press return to search.

షాకింగ్ :శ్రీ‌వారి మెట్టు వద్ద పేలుడు పదార్థాలు!

By:  Tupaki Desk   |   30 Jan 2018 7:16 PM GMT
షాకింగ్ :శ్రీ‌వారి మెట్టు వద్ద పేలుడు పదార్థాలు!
X
తిరుపతి శ్రీవారి మెట్టు వద్ద టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు పేలుడు ప‌దార్థాల‌తో కూడిన ఓ బ్యాగు దొర‌కడం తీవ్ర క‌ల‌కలం రేపింది. చంద్రగిరి మండలం శేషాచల అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు సోమవారం రాత్రి ఆ బ్యాగ్ ల‌భ్య‌మైంది. ఆ బ్యాగులో పేలుడుకు ఉపయోగించే సర్క్యుట్‌ బోర్డులు, సెల్‌ఫోను, వాక్‌మెన్, రెసిస్టర్లు, కెపాసిటర్లు, కండెన్సర్లు ఇతర పరికరాలను గుర్తించారు. దీంతో, ఆర్‌ ఎస్సై వాసు..... ఐజీ కాంతారావుకు ఈ విష‌యాన్ని చేర‌వేశారు. ఘటనా స్థలానికి చేరుకుని వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన కాంతారావు అవి పేలుడుకు ఉపయోగించే పరికరాలుగా నిర్ధారించారు. ఆ త‌ర్వాత కాంతారావు ఇచ్చిన స‌మాచారంతో బాంబు స్య్వాడ్ రంగంలోకి దిగి ఘ‌ట‌నాస్థ‌లాన్ని నిశితంగా ప‌రిశీలింది.

గుర్తుతెలియని వ్యక్తులు వాటిని అక్క‌డ వ‌దిలివెళ్లిన‌ట్లు ప్రాథ‌మిక నిర్థార‌ణ‌కు వ‌చ్చారు. రోజూ వేలాదిమంది భక్తులతో పాటు వీఐపీలు కూడా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకు వెళ్తున్న నేప‌థ్యంలో ఈ బ్యాగు దొర‌క‌డం క‌ల‌క‌లం రేపింద‌ని కాంతారావు తెలిపారు. అయితే, ఎవ‌రిపై అయినా బాంబుదాడి చేసేందుకు ఆ బ్యాగును తెచ్చారా....లేక ఏ ఉద్దేశంతో ఉంచారా అన్నది ద‌ర్యాప్తులో తేలుతుంద‌న్నారు. ఆ బ్యాగ్ పై తమిళనాడు తిరుచ్చికి చెందిన చిరునామా ఉందన్నారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్ధాలను తిరుమల టూటౌన్‌ పోలీసుస్టేషన్ కు త‌ర‌లిస్తామ‌ని చెప్పారు. ఈ కేసును సీరియ‌స్ గా తీసుకొని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని అన్నారు.