Begin typing your search above and press return to search.

మీరు రోజు తాగే ఓఆర్ఎస్ డ్రింక్స్ మంచివేనా .. ?

By:  Tupaki Desk   |   10 Aug 2021 4:19 AM GMT
మీరు రోజు తాగే ఓఆర్ఎస్ డ్రింక్స్ మంచివేనా .. ?
X
మానవ శరీరంలోకి ప్రవేశించే నీటి కంటే శరీరం నుంచి బయటికి వెళ్లిపోయే నీటి శాతం ఎక్కువైతే డీహైడ్రేషన్ కి గురి అవుతారు. శరీరంలో నీటి శాతం తగినంత లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. సాధారణంగా రొటీన్ లో కొంత నీటిని కోల్పోతాము. అదెలా అంటే ... శ్వాస ద్వారా హ్యుమిడిఫైడ్ ఎయిర్ అనేది బయటికి వెళ్తుంది. అలాగే చెమట ద్వారా నీటిని కోల్పోతాము. మూత్రం అలాగే బవుల్ మూవ్మెంట్స్ ద్వారా కూడా కొంత నీటిని కోల్పోతాము. ఈ వాటర్ లాస్ ను రీప్లేస్ చేయడానికి తగినంత నీరు తాగడం ముఖ్యం. శరీరంలో నీటి శాతం ఆరోగ్యకర స్థాయిలో ఉంటే జాయింట్స్ వద్ద లూబ్రికేషన్ సరిగ్గా ఉంటుంది. డీ హైడ్రేషన్ కు గురైనపుడు మనకు డాక్టర్లు ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్) ఇవ్వమని చెబుతారు. ప్రస్తుతం మార్కెట్ లో ఈ ఓఆర్ఎస్ డ్రింకులుగా విరివిగా దొరుకుతున్నాయి. మనం వెంటనే ఒక ఓఆర్ఎస్ డ్రింక్ కొని పిల్లలు , పెద్దలు కూడా తాగుతున్నారు.

కానీ, ఇలా చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ... ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఓఆర్ ఎస్ డ్రింక్స్ లో చాలావరకూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణికాలను పాటించడం లేదు. ఇప్పుడు ఓఆర్ ఎస్ గా విక్రయిస్తున్న చాలా డ్రింకుల్లో మోతాదుకు మించిన తీపిదనం ఉంటోందట. ఇది ఆరోగ్యంపై చెడుప్రభావాన్ని చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుచికరమైన వెర్షన్‌ లలో అధిక చక్కెర ఉన్న పానీయాలు వాస్తవానికి డీ హైడ్రేషన్ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. చాలాసార్లు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి తీసుకువస్తుంది. ఓఆర్ ఎస్ ఎప్పుడూ రుచిలో తీపిగా ఉండకూడదు.

ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణం లేని తియ్యని ఓఆర్ ఎస్ డ్రింక్స్ రోగులకు మంచి కంటే ఎక్కువ హాని కలిగిస్తాయని నిపుణుల అభిప్రాయం. ఓఆర్ఎస్ ఇచ్చినప్పటికీ వారి పరిస్థితి విషమంగా ఉందని తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకువచ్చిన సందర్భాలు దాదాపు ప్రతిరోజూ కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వారు పిల్లలకు ఏమి ఇచ్చారో తనిఖీ చేసినప్పుడు, సాధారణంగా రుచిగా ఉండే ఓ ఆర్ ఎస్ టెట్రాప్యాక్‌లను వాడినట్టు తెలుస్తోంది. ఇందులో చక్కెర అధికంగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు డబ్ల్యూహెచ్‌ ఓ సిఫారసు చేసిన వాటిని ఉల్లంఘిస్తూ చక్కెర, లవణాలను కలిగి ఉన్న అనేక బ్రాండ్‌ లను తమకు తెలియకుండానే ఉపయోగిస్తున్నారు.

ఎందుకంటే, మార్కెట్ లో దొరికేవన్నీ ఓఆర్ ఎస్ డ్రింకులే అని వారు భావిస్తారు. కానీ, నిజానికి అన్ని ఓఆర్ ఎస్ డ్రింకులూ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవిగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల ఒకవైపు ఎక్కువ చక్కెర అతిసారానికి తోడ్పడుతుండగా, అవసరమైన దానికంటే తక్కువ ఉప్పు దాని నష్టాన్ని తగినంతగా భర్తీ చేయదు. అంటే మరింత వ్యాధి లక్షణాలు పెరగడానికి కారణం అవుతున్నాయి తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం వలెనే ఇలా జరుగుతోందని వైద్యులు అంటున్నారు. వివిధ ఫ్లేవర్లలో ఆకర్షణీయమైన ప్యాకింగ్ లలో లభించేవన్నీ ఓఆర్ ఎస్ డ్రింకులే అనే భ్రమలో వారు పడిపోతుంటారు. మరోవైపు పిల్లలు కూడా ఓఆర్ఎస్ డ్రింకు ఇష్టపడతారు. ఇందుకు కూడా కారణం దాని రుచే. ఓఆర్ ఎస్ తీయగా.. మంచి ఫ్లేవర్ తో ఉండడంతో పిల్లలు దానిని ఇష్టంగా తాగేస్తారు. కానీ, ఇది ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని గమనించలేరని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఓఆర్ఎస్ డ్రింక్ కొనే ముందు అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు అనుకూలంగా ఉందొ లేదో తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ అది ప్రమాణాలకు అనుగుణంగా ఉందొ లేదో నిర్ధారించలేనపుడు వైద్యులకు దానిని చూపించి వారి సలహామేరకు ఆ డ్రింక్ వాడాలి

డీహైడ్రేషన్ కి సంబంధించిన మొదటి లక్షణం దాహం. ఎక్కువ నీటిని తాగాలన్న కోరిక కలగడం ప్రధాన లక్షణం. డిహైడ్రేషన్ కి గురైతే మూత్రం చిక్కగా పసుపు రంగులో వస్తుంది. వాటర్ లాస్ పెరుగుతుంది. డ్రై మౌత్, కండరాల నొప్పులు, వికారం మరియు వాంతులు, గుండెదడ, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన డీహైడ్రేషన్ వల్ల కన్ఫ్యూజన్, బలహీనత వంటివి తలెత్తుతాయి. ఎందుకంటే మెదడుతో పాటు ఇతర అవయవాలకు రక్తసరఫరా సరిగ్గా ఉండదు. సరైన సమయంలో చికిత్స అందకపోతే, చివరికి, కోమాతో పాటు అవయవాలు దెబ్బతినే ప్రమాదం కూడా వస్తుంది. కోల్పోయిన ఫ్లూయిడ్స్ ను రీప్లేస్ చేయడం ద్వారా డీహైడ్రేషన్ సమస్యను పరిష్కరిస్తారు. నోటి ద్వారా ఫ్లూయిడ్ ను రీప్లేస్ చేయవచ్చు. లేదా ఐవీ ద్వారా రీప్లేస్ చేయవచ్చు. ఓరల్ రీహైడ్రేషన్ ను ప్రయత్నించినప్పుడు స్మాల్ అమౌంట్స్ లో క్లియర్ ఫ్లూయిడ్స్ ను పేషంట్ కు అందిస్తూ ఉండాలి. క్లియర్ ఫ్లూయిడ్స్ కేటగిరీలోకి నీళ్లు, ఉడకబెట్టిన పులుసులు, పాప్సికల్స్, జెల్లోతో పాటు ఎలెక్ట్రోలైడ్స్ కలిగిన ఇతర రీప్లేస్మెంట్ ఫ్లూయిడ్స్ వస్తాయి.