Begin typing your search above and press return to search.

హెచ్ 1బీ కి అమెరికన్ల అడ్డు

By:  Tupaki Desk   |   19 March 2015 5:42 AM GMT
హెచ్ 1బీ కి అమెరికన్ల అడ్డు
X
భారతదేశం నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అమెరికాకు వెళుతున్న ఉద్యోగార్థులకు ఇదొక బ్యాడ్ న్యూస్. ఉద్యోగాలకు సరిపడా ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉన్న వారికి అమెరికా అందించే హెచ్ 1బీ వీసా పై ఆ దేశానికి చెందిన విజిల్ బ్లోయర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

హెచ్ 1బీ వీసాను కలిగి ఉన్న విదేశీ ఉద్యోగుల వల్ల అమెరికన్ల ఉపాధి అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని అమెరికాకు చెందిన మైగ్రెంట్ పాలసీ సెనెట్ కమిటీ ముందు పామర్ వాదించారు. ఉద్యోగాలకు అవసరమైన ప్రత్యక నైపుణ్యాలు స్థానిక అమెరికన్లకు లేనందువల్లే లేదా ఉద్యోగాల్లో చేరటానికి వారు ముందుకు రాకపోవడం వల్లే హెచ్ 1బీ వీసా ఉన్న విదేశీయులకు అవకాశాలు ఇస్తున్నామంటూ కంపెనీలు చేస్తున్న వాదనలను ఆయన ఖండించారు.

హెచ్ 1బీ వీసా ద్వారా వస్తున్న వారికి ప్రత్యేక నైపుణ్యాలేమీ ఉండట్లేదని, వారి సామర్థ్యం కనీస స్థాయిలోనే ఉంటుందని, కొన్ని సార్లు ఆ మాత్రం కూడా ఉండటం లేదని అక్కసు వెళ్లగక్కారు. అమెరికాకు వచ్చిన తర్వాత వారికి అమెరికన్లచే శిక్షణ ఇప్పించి ఉద్యోగాలకు అవసరమైన సామర్థ్యాలను అందిస్తున్నారని తెలిపారు. కావాలనే స్థానిక అమెరికన్లకు ఉద్యోగాలివ్వకుండా విదేశీయుల్ని నియమించుకుంటున్నాయని ఆరోపించారు.

ఇటీవలే హెచ్ 1బీ వీసా డిపెండెంట్లకు కూడా ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తూ అమెరికా సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పామర్ ఉద్యమానికి పునాదులు వేయడం ఆసక్తికరంగా మారింది. ఇండియన్ల వర్క్ కమిట్ మెంట్, అమెరికన్లతో పోల్చుకుంటే తక్కువ వేతనంతో పనిచేస్తుండటం వంటి కారణాల వల్ల అమెరికాలో కంపెనీలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఆసక్తిచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వాదన ఎటువైపు దారితీస్తుందో చూడాలి మరి!