Begin typing your search above and press return to search.

షర్మిల పాదయాత్ర కోసం ఎంత ఖర్చు పెట్టారు...?

By:  Tupaki Desk   |   30 Nov 2022 8:37 AM GMT
షర్మిల పాదయాత్ర కోసం ఎంత ఖర్చు పెట్టారు...?
X
వైఎస్సార్టీపీ అధినేత్రి హోదాలో వైఎస్ షర్మిల తెలంగాణా అంతటా పాదయాత్ర చేస్తున్నారు. ఆమె ఈ రోజుకు చూస్తే అధికారంలో లేరు. అధికారంలో ఉన్న పార్టీలో కూడా లేరు. మంత్రి, ఎమ్మెల్యే వంటి పదవులు గతంలో నిర్వహించలేదు. ఆమె కూడా అందరి మాదిరిగానే పార్టీ పెట్టుకున్నారు

వాస్తవానికి చూస్తే ఈ రోజుల్లో రాజకీయాలు చేయడం ఎంత కష్టమో సగటు మనుషులకు తెలుసు. అడుగు తీసి అడుగు వేస్తే తడిసి మోపెడు అయ్యే ఖర్చు. అలాంటిది షర్మిల పాదయాత్ర పేరిట ఏకంగా తెలంగాణా మొత్తం రెండేళ్లుగా చుట్టేస్తున్నారు. ఆమె ఏకంగా ఈ రోజు నాటికి 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆమె పాదయాత్రకు కోట్లలోనే ఖర్చు అవుతుందని టీయారెస్ వారు లెక్కలు తీసి మరీ చెబుతున్నారు.

తాజాగా టీయారెస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అయితే షర్మిల పాదయాత్రకు రోజుకు ఇరవై లక్షల నుంచి ముప్పయి లక్షల దాకా ఖర్చు అవుతుందని ఘాటైన ఆరోపణలు చేశారు. మరి ఇంత ఖర్చుకు అయ్యే డబ్బు ఆమెకు ఎక్కడ నుంచి వస్తోంది అని ఆయన ప్రశ్నించారు. ఒక టీవీ న్యూస్ చానల్ డిబేట్ లో మాట్లాడురూ సుదర్శన్ రెడ్డి ఈ సంచనల ఆరోపణలు చేశారు.

ఆయన ఈ ఆరోపణలు చేశాక అందరిలోనూ దీని మీద కూడా ప్రశ్నలు కొత్తగా పుట్టుకువస్తున్నాయి. అదే చానల్ లో మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి మరిన్ని కొత్త ఆరోపణలు చేశారు. షర్మిల కోసం ఏర్పాటు చేసిన కస్టమైజ్డ్ బస్సు ఆమెదేనని వైఎస్‌ఆర్‌టీపీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారని చెబుతున్నారు. అలాగే పాదయాత్రలో షర్మిలతో పాటు రోజూ నడిచే మహిళలకు మూడు వందల రూపాయలు ఇస్తున్నారు అని కూడా ప్రచారం సాగుతోంది.

ఇక ఇప్పటిదాకా చూస్తే షర్మిల 222 రోజుల పాటు నడిచారు. అంటే రోజుకు ఇరవై లక్షల వంతున దీన్ని లెక్క వేస్తే కచ్చితంగా ఆ మొత్తం 44.40 కోట్ల రూపాయలు అవుతుంది అని అంటున్నారు. అంటే ఇది సామన్యమైన బడ్జెట్ కాదు, కాస్ట్లీ బడ్జెట్ గానే చూస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి ఆమె పాదయాత్ర చేస్తున్నారు అని టీయారెస్ అంటున్నారు.

నిజంగా చూసుకుంటే మాత్రం ఇది షర్మిల వంటి ఒక రాజకీయ నాయకురాలు పెట్టగలిగే మొత్తమా అని ప్రశ్నలు వస్తున్నాయి. దాదాపుగా యాభై కోట్ల దాకా ఖర్చు పెట్టి పాదయాత్ర ఆమె చేస్తున్నారా అన్న కొత్త చర్చకు టీయరెస్ నేతలు తెర తీశారు.

ఇదంతా ఎందువల్ల వచ్చింది అంటే వైసీపీ ఎమ్మెల్యే షర్మిల అరెస్ట్ తో తెలంగాణా రాజకీయాలు వేడెక్కాయి. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీద షర్మిల అవినీతి ఆరోపణలు చేశారు. ఆయన వేల కోట్ల సంపదను కూడబెట్టారు అని ఆమె విమర్శించారు. దాని ఫలితంగా నర్సంపేటలో దాడులు టీయారెస్ వారు చేశారు. ఆ మీదట షర్మిల అరెస్ట్ కావడం హైదరాబాద్ లో ఆమె కారు ని క్రేన్ సాయంతో తీసుకెళ్ళి మరీ మరోసారి అరెస్ట్ చేయడం అదంతా జాతీయ మీడియాలో ఫోకస్ కావడం జరిగాయి.

ఇపుడు చూస్తే రివర్స్ లో టీయారెస్ నేతలు షర్మిలకు అంత డబ్బు ఎక్కడిది, ఆమె పాదయాత కోట్ల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని అంటున్నారు. మరి దీని మీద వైఎస్సార్టీపీ నేతలు సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని అంటున్నారు. నిజంగా పాదయాత్ర చేసే నాయకులకు ఆయా జిల్లాల నేతలు ఖర్చులు పెట్టుకుంటారు.

షర్మిల పార్టీలో ఆమె ఏకైక నాయకురలిగా ఉన్నారు. ఈ రోజుకీ పెద్ద లీడర్ అన్న వారు ఒక్కరూ లేరు. మరి షర్మిలకు ఈ మొత్తం ఎవరు భరిస్తున్నారు అంటే అది నిజంగా ఒక పెద్ద ప్రశ్నగానే ఉందని ప్రచారం సాగుతోంది. అయితే షర్మిల ఎవరికీ ఒక్క రూపాయీ కూడా ఇవ్వడంలేదని, ఆమెను చూసి మహిళలు కానీ జనాలు కానీ పాదయాత్రలో వెంట నడుస్తున్నారు అని వైఎస్సార్టీపీ నేతలు చెబుతున్నారు.

ఏది ఏమైనా ఈ విషయాలు మాత్రం ఇపుడు కొత్త చర్చకు దారి తీస్తునాయి. షర్మిల పార్టీ వారు దీని మీద క్లారిటీ ఇస్తారా అన్నది చూడాలి. అయినా గతంలో ఆమె పాదయాత్ర చేసినపుడు లేని లెక్కలు ఖర్చులు ఇపుడే ఎందుకు టీయారెస్ వారికి గుర్తుకు వస్తున్నాయని కూడా అడుగుతున్నారు. ఇదంతా షర్మిల పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకనే అని అంటున్నారు. సో ఏది ఎలా ఉన్నా కూడా షర్మిల చుట్టూ ఇపుడు టీయారెస్ నేతల ఫోకస్ పడింది అని అంటున్నారు. ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.