Begin typing your search above and press return to search.

గ్రేటర్ ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయ్?

By:  Tupaki Desk   |   3 Feb 2016 5:17 AM GMT
గ్రేటర్ ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయ్?
X
గ్రేటర్ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ముగిసింది. మజ్లిస్ ఆరాచకం మినహా.. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఎపిసోడ్ సాఫీగానే సాగింది. ఈసారి పోలింగ్ భారీగా జరుగుతుందని ఆశించినా.. కేవలం 45 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ అనంతరం.. ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అదే సమయంలో పార్టీలు తమకొచ్చే సీట్ల సంఖ్యను చెప్పుకొచ్చాయి. ఎగ్జిట్ పోల్స్.. ఆయా పార్టీల అంచనాలు.. వాటి మధ్య తేడా చూస్తే..

ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణ అధికారపక్షం టీఆర్ ఎస్ కు 81 నుంచి 85 సీట్లు.. టీడీపీ బీజేపీలక 25 నుంచి 30 సీట్లు.. మజ్లిస్ కు 32 నుంచి 37.. కాంగ్రెస్ కు 3 నుంచి 7.. ఇతరులకు మూడు స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేల్చాయి.

ఇక.. పార్టీల వారీగా చూస్తే..తమకు 75 స్థానాలు వరకు వస్తాయని తెలంగాణ అధికారపక్షం చెబుతుంటే.. 40 స్థానాలకు పైగా విజయం తమదేనన్న ధీమాను మజ్లిస్ వ్యక్తం చేసింది. ఇక.. టీడీపీ 30 నుంచి 40 స్థానాల్లో గెలుస్తామంటే.. బీజేపీ సొంతంగా 18 వరకు విజయం ఖాయమని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ కూడా తమకు 15 సీట్లు పక్కా అని చెబుతోంది.

ఇక.. ఎగ్జిట్ కు పార్టీల అంచనాలకు మధ్యనున్న వ్యత్యాసం చూస్తే.. టీఆర్ఎస్ కు ఎగ్జిట్ పోల్స్ 81 నుంచి 85 వరకు వస్తాయంటే.. ఆపార్టీ ఎగ్జిట్ పోల్స్ కంటే తక్కువగా తమకు 75 స్థానాలే వస్తాయని చెప్పటం గమనార్హం. అదే సమయంలో మజ్లిస్ కు 32 నుంచి 37 డివిజన్లు అని ఎగ్జిట్ పోల్స్ చెబితే.. తాము 40 స్థానాల్లో విజయం సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేసింది. మజ్లిస్ మాటకు.. ఎగ్జిట్ పోల్స్ కు మధ్యన స్వల్ప వ్యత్యాసం ఉంది.

ఇక.. టీడీపీ బీజేపీలకు కలిసి ఎగ్జిట్ పోల్స్ 25 నుంచి 30స్థానాలు అని అంచనా వేస్తే.. ఆ పార్టీలు వేర్వేరుగానే 50కు పైగా సీట్లు తమకు వస్తాయని పేర్కొన్నాయి. తెలుగుదేశం పార్టీ 30 నుంచి 40 మధ్యలో.. బీజేపీ 18 వరకు వస్తాయని చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ తో పోలిస్తే.. ఈ రెండు పార్టీలు చెబుతున్న మాటల లెక్కల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇక.. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. 3 నుంచి 7 వరకు అని ఎగ్జిట్ పోల్స్ చెబుతుంటే.. 15 వరకు వస్తాయని కాంగ్రెస్ పేర్కొంటోంది. ఎగ్జిట్ కు.. కాంగ్రెస్ పార్టీ అంచనాలకు మధ్య దూరం ఎక్కువే.

ఎగ్జిట్ పోల్స్ కంటే తక్కువగా టీఆర్ఎస్ తాము గెలిచే స్థానాల గురించి చెప్పుకుంటే.. టీడీపీ.. బీజేపీ.. కాంగ్రెస్ లు మాత్రం ఎగ్జిట్ పోల్స్ కంటే ఎక్కువ ఫలితాలు వస్తాయని చెప్పుకొచ్చారు. మరి ఎవరి లెక్కలు కరెక్ట్ అన్నది ఈ నెల 5న (శుక్రవారం) వెల్లడి కానున్నాయి. అప్పటివరకూ వెయిట్ చేయాల్సిందే.