Begin typing your search above and press return to search.

ఈ రెండు చోట్ల ఎగ్జిట్ పోల్స్ చతికిలపడ్డాయిగా?

By:  Tupaki Desk   |   2 May 2021 9:30 AM GMT
ఈ రెండు చోట్ల ఎగ్జిట్ పోల్స్ చతికిలపడ్డాయిగా?
X
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే ట్రెండ్ ఎలా ఉందన్న విషయంపై స్పష్టత వచ్చేసినట్లే. ఏ రాష్ట్రంలోఏ పార్టీ అధికారంలోకి రానుంది? ఏ పార్టీ రాలేదన్న విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఎగ్జిట్ పోల్స్ లో పేర్కొన్నట్లుగా ఫలితాలు వస్తున్నట్లు అందరూ చెబుతున్నా.. కాస్త లోతుల్లోకి వెళ్లి చూస్తే.. రెండు కీలక రాష్ట్రాల విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బొక్కబోర్లా పడినట్లుగా చెప్పక తప్పదు.

మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా.. అందరి ఆసక్తి పశ్చిమబెంగాల్ మీదనే ఉంది. తమిళనాడులో విపక్ష డీఎంకే అధికారంలోకి వస్తుందని అందరూ అంచనాలు వేశారు. ఎగ్జిట్ పోల్స్ లోనూ అధికారం డీఎంకేదేనని తేల్చారు. అదే సమయంలో పశ్చిమబెంగాల్ లో టీఎంసీ.. బీజేపీ మధ్య పోటాపోటీగా ఉంది. స్వల్ప మెజార్టీతో దీదీ పార్టీ గెలుస్తుందని అంచనాలు వెలువడ్డాయి. ఇక్కడే ఎగ్జిట్ పోల్స్ అడ్డంగా ఫెయిల్ అయ్యాయని చెప్పాలి. ఎందుకంటే.. పశ్చిమబెంగాల్ లో ఫలితం పోటాపోటీగా ఉంటుందన్న స్థానే.. ఇప్పుడు వెలువడుతున్న ఫలితాలు క్లియర్ కట్ గా ఉండటమే కాదు.. టీఎంసీకి తిరుగులేని అధిక్యతను బెంగాలీలు కట్టబెట్టారు.

తన శక్తిసామర్థ్యాల్ని పెట్టి.. మోడీషాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికి తుది ఫలితం మాత్రం కమలనాథులకు పూర్తి నిరాశకు గురి చేసేలా ఉంది. మొత్తం 292 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఎంసీ 203 స్తానాల్లో అధిక్యతలో దూసుకుపోతోంది. బీజేపీ 83 స్థానాలకే పరిమితమైంది. ఈ తరహా ఫలితాన్ని ఎవరూ ఊహించలేదు. ఇక.. తమిళనాడులో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడ మొత్తం 234 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో విపక్ష డీఎంకే తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తుందని భావించారు. అనూహ్యంగా డీఎంకే కూటమికి ఇప్పటివరకు 138 స్థానాల్లోనే అధిక్యత ఉండగా.. అధికార అన్నాడీఎంకే కూటమికి 95 స్థానాల్లో అధిక్యతలో నిలిచింది.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన 132 స్థానాలకు కేవలం ఆరు స్థానాల్లోనే అధిక్యతలో ఉండటం.. అది కూడా కూటమి మొత్తానికి కలిపి కావటం చూస్తే.. ఇలాంటి ఫలితాన్ని ఎగ్జిట్ పోల్స్ లో ఎవరూ అంచనా వేయలేదనే చెప్పాలి. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో అతి పెద్ద రెండు రాష్ట్రాల ఫలితాల సరళిని అంచనా వేయటంలో ఎగ్జిట్ పోల్స్ బొక్కబోర్లా పడ్డాయని చెప్పక తప్పదు.