Begin typing your search above and press return to search.

క‌న్ప్యూజ్ చేయ‌నున్న ఎగ్జిట్ పోల్స్..!

By:  Tupaki Desk   |   18 May 2019 4:44 AM GMT
క‌న్ప్యూజ్ చేయ‌నున్న ఎగ్జిట్ పోల్స్..!
X
సుదీర్ఘంగా సాగుతున్న ఎన్నిక‌ల ఏడో విడ‌త పోలింగ్ కు ముందున్న ప్ర‌చార స‌మ‌యం ముగిసింది. ఇక‌.. మిగిలింది పోలింగ్ మాత్ర‌మే. పోలింగ్ పూర్తి అయిన నిమిషాల వ్య‌వ‌ధిలోనే తాము సేక‌రించిన ఎగ్జిట్ పోల్స్ ను ప్ర‌క‌టించేందుకు ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల‌న్ని సిద్ధ‌మ‌వుతున్నాయి. గ‌తానికి భిన్నంగా ఈసారి ఎన్నిక‌లు ఉండ‌టం.. ఓట‌ర్ మైండ్ సెట్ ఏమిట‌న్న విష‌యంపై విప‌రీత‌మైన క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది.

దీనికి తోడు.. అధికార విప‌క్షాలు ఒకే త‌ర‌హాలో కాన్ఫిడెన్స్ ను ప్ర‌ద‌ర్శించ‌టంతోపాటు.. గెలుపు అవ‌కాశాల‌పై ఎవరికి వారు చెప్పుకుంటున్న లెక్క‌లు విష‌యాన్ని మ‌రింత టిపిక‌ల్ గా మారుస్తున్నాయ‌ని చెప్పాలి. ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న దానిపై ఎగ్జిట్ పోల్స్ మీద ఆశ‌లు పెట్టుకున్న వారెంద‌రో. అయితే.. ఇప్పుడు అదే ఎగ్జిట్ పోల్స్ టెన్ష‌న్ ను మ‌రింత పెంచ‌టం ఖాయ‌మంటున్నారు.

ఏడో ద‌శ పోలింగ్ ముగిసిన వెంట‌నే ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. ఇవి వ‌చ్చిన రెండు రోజుల‌కు తుది ఫ‌లితాల వెల్ల‌డి ఉండ‌నుంది. ఈ రెండు రోజులు కంటినిండా కునుకు లేని ప‌రిస్థితి ఖాయ‌మంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ త‌మ‌కు అనుకూలంగా వ‌చ్చిన వారు సంతోషంతో మునిగిపోవ‌టం ఖాయ‌మ‌ని.. అదే స‌మ‌యంలో వాటి విశ్వ‌స‌నీయ‌త విష‌యంలో ఉండే అస్ప‌ష్ట‌త‌తో టెన్ష‌న్ మ‌రింత పెర‌గ‌టం ఖాయం. ఇక‌.. ఎగ్జిట్ పోల్స్ లోనెగిటివ్ వ‌చ్చిన వారు.. త‌మ చేతిలో ఉన్న స‌మాచారాన్ని.. ఎగ్జిట్ పోల్స్ చెప్పే అంకెల్ని స‌రి చూసుకోవ‌టంలో మునిగిపోతాయ‌ని.. క్యాడ‌ర్ నీర‌సించిపోయే వీలుంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

ఈ ఇబ్బందిక‌ర పరిస్థితిని గుర్తించిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఎగ్జిట్ పోల్స్ ను న‌మ్మొద్ద‌ని.. విజ‌యం త‌మ‌దేనన్న ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో తమ‌దే విజ‌య‌మ‌ని చెబుతున్న ఆయ‌న‌.. ఎగ్జిట్ పోల్స్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌ద్ద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. మీడియా హౌస్ ల‌లో త‌న‌కున్న ప‌ర‌ప‌తిని ఉప‌యోగించి ఇప్ప‌టికే ఏపీ ఎగ్జిట్ పోల్స్ వివ‌రాల్ని బాబు తెప్పించుకున్న‌ట్లుగా చెబుతున్నారు. అన్నింటిలోనూ నెగిటివ్ మార్కులు రావ‌టంతో ఆయ‌న రూటు మార్చి.. ఎగ్జిట్ పోల్స్ ను ప‌ట్టించుకోకుండా ఓట్ల లెక్కింపు అంశంపై దృష్టి పెట్టాల‌ని కోర‌టం వెనుక అస‌లు కార‌ణం ఇదేనంటున్నారు.