Begin typing your search above and press return to search.

సోనియా కి మరో లేఖ రాసి కాక పుట్టిస్తున్నారు

By:  Tupaki Desk   |   7 Sept 2020 6:00 PM IST
సోనియా కి మరో లేఖ రాసి కాక పుట్టిస్తున్నారు
X
దేశ చరిత్రలో వందేళ్ళకి పైగా సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన జాతీయ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. వరుసగా రెండుసార్లు బీజేపీ కాంగ్రెస్ ను మట్టికరిపించి అధికారాన్ని అందుకుంది. ఇక 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని అందుకోవడంతో రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా .. మళ్లీ సోనియా గాంధీ అధ్యక్ష భాద్యతలు చేపట్టింది. అయితే , ఆమె అద్యక్షతని ప్రశ్నిస్తూ .. క్రియాశీలక, పూర్తి కాలపు నాయకుడు కావాలంటూ 23 మంది సీనియర్లు లేఖ రాసి కాంగ్రెస్ లో కాకరేపారు. ఆ తరువాత ఆ సమస్య తీరిపోయింది అని అనుకుంటే బహిష్కృత నేతలు మరో లేఖ రాసి కాక పుట్టిస్తున్నారు.

యూపీ కాంగ్రెస్ బహిష్కృత నేతలు ఈసారి నేరుగా సోనియా గాంధీనే టార్గెట్ చేస్తూ ఓ లేఖ రాశారు. కుటుంబ అనుబంధాలను దాటి ఆలోచించండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో మళ్లీ కాంగ్రెస్ లో కలకలం మొదలైంది. నెహ్రూ, ఇందిర, రాజీవ్ కాంగ్రెస్‌ను నిర్మించారు. దేశంలో ప్రజాస్వామ్య పునాదులు కూడా వేశారు. కానీ కొంత కాలంగా పార్టీని నడుపుతున్న విధానాన్ని చూస్తుంటే సాధారణ కార్యకర్తల్లో తీవ్ర గందరగోళాన్ని, నిరాశను కలిగిస్తోంది.’’ అంటూ బహిష్కృత నేతలైన సంతోశ్ సింగ్, సత్యేదేవ్ త్రిపాఠి లేఖలో తెలిపారు. దయచేసి కుటుంబ అనుబంధాలకు అతీతంగా ఆలోచించండి. పార్టీ సంప్రదాయాలు, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ విలువలను పునరుద్ధరించండి. పరస్పర విశ్వాసాలను పార్టీలో పెంచండి అంటూ ఆ లేఖ లో కోరారు.

ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్య విలువలు, సామాజిక విలువలు తగ్గిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో దేశానికి కాంగ్రెస్ అవసరం ఎంతో ఉందని, కాంగ్రెస్ సజీవంగా, ధృఢంగా ఉండాలని వారు ఆ లేఖలో తెలిపారు. ఇకపోతే , బహిరంగ వేదికలలో పార్టీపై విమర్శలు చేయడం, పార్టీ ఇమేజ్‌ను దెబ్బ తీయడం లాంటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ యూపీకి చెందిన పది మంది నేతలను అధిష్ఠానం బహిష్కరించిన సంగతి తెలిసిందే.