Begin typing your search above and press return to search.

రోజులో హైదరాబాద్ మహానగర వాసులు రూ.100 కోట్లు తాగేశారా?

By:  Tupaki Desk   |   17 Oct 2021 12:51 PM GMT
రోజులో హైదరాబాద్ మహానగర వాసులు రూ.100 కోట్లు తాగేశారా?
X
పండగ అంటే.. గుడికి వెళటం.. అథ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం. మనసును నిర్మలంగా ఉంచుకుంటూ.. సకుటుంబ సమేతంగా హాయిగా కలిసి ఉండటం లాంటివి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. మారిన కాలానికి తగ్గట్లు ప్రజల అలవాట్లు.. అభిరుచులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు పండగ అంటే పూజ కంటే ముందు భారీ షాపింగ్.. మందు.. ముక్కతో తాగి.. తిని ఊగిపోవటమే పరమార్థంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగను అంగరంగ వైభవంగా చేసుకోవటంలో తెలంగాణ ముందుంటుంది. ఈ పండక్కి తెలంగాణ ప్రజలు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.

ఏపీ ప్రజలు సంక్రాంతికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తే.. తెలంగాణ ప్రజలు మాత్రం దసరాకు ఫుల్ ప్రయారిటీ ఇస్తుంటారు. అయితే.. పండుగ వేళ.. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. మద్యం అమ్మకాలు జోరుగా సాగటం.. పాత రికార్డుల్ని బద్ధలు కొట్టేసేలా కొత్త రికార్డులు నమోదు కావటం విశేషం. పండగ ఒక్కరోజులో ఏకంగా రూ.200 కోట్ల మేర మద్యం అమ్మకాలు సాగాయని.. ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే దాదాపుగా వంద కోట్ల రూపాయిల మేర అమ్మకాలు సాగినట్లుగా చెబుతున్నారు.
పండగ సీజన్ నేపథ్యంలో ఐదు రోజుల వ్యవధిలో తెలంగాణవ్యాప్తంగా రూ.685 కోట్ల మేర మద్యం అమ్మకాలు సాగటం విశేషంగా చెప్పాలి. గత ఏడాది దసరా పండగతో పోలిస్తే ఈసారి ఏకంగా రూ.200 కోట్ల మేర ఖర్చు అదనంగా జరగటం చూస్తే.. పండగ పరమార్థం తాగటమేనా? అన్న భావన కలుగక మానదు. తెలంగాణలో అంతకంతకూ మద్యం అమ్మకాలు భారీగా పెరిగిపోతున్నాయని.. మద్యం మత్తులో రాష్ట్రం ఊగుతోందన్న మాట బలంగా వినిపిస్తోంది. తాజాగా విడుదలైన గణాంకాల్ని చూస్తే.. ఈ నెల మొదటి 12 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముడైన మద్యం అక్షరాల రూ.1430 కోట్లుగా చెబుతున్నారు.

మద్యం అమ్మకాలు భారీగా సాగుతుండటంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం లభించే వీలుంది. ఇదంతా బాగానే ఉన్నా.. ఇంత ఎక్కువగా తాగటం వల్ల.. ఆరోగ్యానికి కలిగే హాని మాటేమిటి? అన్నది ప్రశ్న. ఆనందం కోసం తాగటం బాగానే ఉన్నా.. అదో అలవాటుగా..వ్యసనంగా మారి కుటుంబాల్ని దెబ్బ తీస్తుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మద్యం అమ్మకాల అంకెలు ఆశ్చర్యపరిచేలా మాత్రమే కాదు..ఆందోళన కలిగించే స్థాయికి తాగుడు అలవాటు చేరిందన్నది చేదు నిజం. దీని నుంచి తెలంగాణ ప్రజలు ఎలా దూరమవుతారన్నది ఇప్పుడు అన్నింటికి మించిన పెద్ద సవాలు.