Begin typing your search above and press return to search.

విప్రోపై మాజీ ఉద్యోగుల సంచ‌ల‌న నిర్ణ‌యం‌.. వివ‌క్ష చూయిస్తోంద‌ని కోర్టుకు

By:  Tupaki Desk   |   28 April 2020 7:00 PM IST
విప్రోపై మాజీ ఉద్యోగుల సంచ‌ల‌న నిర్ణ‌యం‌.. వివ‌క్ష చూయిస్తోంద‌ని కోర్టుకు
X
ఉద్యోగం అంటేనే ఒక‌రి కింద ప‌ని చేయాలి. అది ప్రైవేటైనా.. ప్ర‌భుత్వ ఉద్యోగ‌మైనా బాస్ కింద ప‌ని చేయాల్సిందే. అది ఎంత‌టి ఉద్యోగికైనా త‌ప్ప‌దు. ఇక ప్రైవేటు ఉద్యోగాలైతే కొన్ని సంస్థ‌ల్లో బానిస బ‌తుకు మాదిరిగా ఉంటుంది. మ‌రికొన్ని సంస్థ‌ల్లో వారి అడుగుల‌కు మ‌డుగులు వ‌త్తితే పెద్ద‌స్థాయిలో ఉంటారు.. లేదంటే అధ‌మ స్థాయిలో ఉంటారు. ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఈ క్ర‌మంలో వివ‌క్ష‌, ప‌క్ష‌పాతం, రాజ‌కీయం వంటివి ఉండ‌నే ఉంటాయి. ఇదే అంశంపై ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ‌పై మాజీ ఉద్యోగులు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఏకంగా కోర్టును ఆశ్ర‌యించారు. త‌మ‌పై వివక్ష చూపిస్తోందంటూ ఇండియన్ సాఫ్టువేర్ దిగ్గజం విప్రోపై అమెరికాలో ఐదుగురు మాజీ ఉద్యోగుల బృందం క్లాస్ యాక్షన్ దావా వేయ‌డం సాఫ్ట్‌వేర్ రంగంలో సంచ‌ల‌నంగా మారింది.

దక్షిణాసియా, భారతీయ మూలాలు ఉన్న వారికే విప్రో ప్రాధాన్యం ఇస్తోందని న్యూజెర్సీ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆ ఉద్యోగులు పిటిష‌న్ దాఖలు చేశారు. అమెరికా ఐటీ పరిశ్రమలో దక్షిణాసియా ఉద్యోగుల సంఖ్య 12 శాతం కాగా, ఒక్క విప్రో అమెరికా విభాగంలో ఏకంగా 80 శాతం మంది ఉన్నారని, ఇందులో ప్రధానంగా భారతీయులు ఉన్నారని ఈ సంద‌ర్భంగా వారు ఆరోపించారు. అమెరికా సహా అన్ని దేశాల్లో ఆల్ టైం హైకి స్టోరేజ్, చమురు ధరపై ప్రభావం అమెరికాలో 14,000 మంది ఉద్యోగులు దక్షిణాసియేతర, ముఖ్యంగా భారతీయేతర ఉద్యోగులపై విప్రో వివక్ష చూపిస్తోందని ఆ మాజీ ఉద్యోగులు వాపోయారు.

బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న విప్రోలో మొత్తం 1.60 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 14,000 మందికి పైగా అమెరికాలో ఉన్న కంపెనీ కార్యాలయాల్లో పని చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అమెరికాలోని విప్రో సంస్థలో పని చేసిన గ్రెగోరీ మాక్లీన్ (కాలిఫోర్నియా), రిక్ వాలెస్ (కాలిఫోర్నియా), అర్దేశీర్ పెజెష్కి (కాలిఫోర్నియాలో ఉండే ఇరానియన్), జేమ్స్ గిబ్స్ (టెన్నెస్సీ), రొనాల్డ్ హేమెన్వే (ఫ్లోరిడా) ఈ లా సూట్ దాఖలు చేశారు. వీరిలో నలుగురు అమెరికన్ సంతతికి చెందిన వారు కాగా మరొకరు ఇరానియన్. దక్షిణాసియన్లకు విప్రో అధిక ప్రాధాన్యం ఇస్తోందని వారు ఆరోపించారు. ఆ వివ‌క్ష‌తోనే తాము ఉద్యోగాలు కోల్పోయామని తెలిపారు.

దక్షిణాసియన్లు, భారతీయులు కాని వారికి అప్రైజల్ స్కోర్స్ ఇవ్వడం లేదని, వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన వీరిలో ఎక్కువ సంఖ్యలో ఉద్వాసనకు గురవుతున్నారని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వాటితో పాటు పదోన్నతులు, జీతం పెంపు, తొలగింపు నిర్ణయాలకు సంబంధించిన విష‌యాల్లో కూడా బేధం చూపిస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ దావాపై విప్రో సంస్థ స్పందించేందుకు నిరాక‌రించింది. కోర్టు ప‌రిధిలో ఉన్న అంశం కావ‌డంతో నోరు మెద‌ప‌లేదు.