Begin typing your search above and press return to search.

రాహుల్‌ ప్రధాని అయితేనే వైస్సార్ ఆత్మ సంతోషిస్తుంది: మాజీ ఎంపీ కేవీపీ సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   25 April 2023 11:00 AM
రాహుల్‌ ప్రధాని అయితేనే వైస్సార్ ఆత్మ సంతోషిస్తుంది: మాజీ ఎంపీ కేవీపీ సంచలన వ్యాఖ్యలు!
X
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుల మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గుల్బర్గా కళాశాలలో ఎంబీబీఎస్‌ చదువుకునేటప్పటి నుంచి వైఎస్సార్‌ కన్నుమూసే వరకు వీరి మధ్య స్నేహం అలాగే వర్థిల్లింది. వైఎస్సార్‌ కు కేవీపీని సోల్‌ మేట్‌ గా, ఆత్మ బంధువుగా చెబుతారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున రెండుసార్లు రాజ్యసభకు ఎంపికైన కేవీపీ పదవీకాలం ముగిసింది.

కొంతకాలం పాటు స్తబ్దుగా ఉన్న కేవీపీ రామచంద్రరావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌ కుటుంబసభ్యులు ముఖ్యమంత్రులు కావడం కంటే.. రాహుల్‌ గాంధీ ప్రధానైతేనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆత్మ సంతోషిస్తుందని కేవీపీ హాట్‌ కామెంట్స్‌ చేశారు. విజయవాడలోని జింఖానా మైదానంలో పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అధ్యక్షతన నిర్వహించిన 'జై భారత్‌ సత్యాగ్రహ బహిరంగ సభ'లో కేవీపీ ప్రసంగించారు.

దివంగత సీఎం వైఎస్సార్‌ జీవించి ఉన్నప్పుడు చివరిసారి కాంగ్రెస్‌ కార్యకర్తలతో మాట్లాడుతూ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో 41 ఎంపీ సీట్లు సాధించి రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలని సందేశమిచ్చారని కేవీపీ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ ఆశయ సాధనకు కాంగ్రెస్‌ కార్యకర్తలు కృషి చేయాలని కేవీపీ సూచించారు.

ప్రస్తుత పార్లమెంటులో వైసీపీ, టీడీపీలకు 36 మంది ఎంపీలు ఉన్నారన్నారు. అయితే రాహుల్‌ గాంధీ లోక్‌ సభ సభ్యత్వాన్ని అన్యాయంగా తొలగిస్తే వైసీపీ, టీడీపీ, జనసేనల్లో ఒక్క పార్టీ కూడా ఖండించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను, పార్లమెంటరీ వ్యవస్థను దెబ్బతీసే చర్యలను ప్రశ్నించకపోవడాన్ని చూసి తెలుగువాడిగా సిగ్గుపడుతున్నానని కేవీపీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన... బీజేపీ గూటిపక్షులేనని ధ్వజమెత్తారు.

రాజ్యసభ సభ్యురాలు రంజీత్‌ రంజన్‌ మాట్లాడుతూ దేశంలో అదానీ అక్రమాల పై తక్షణమే సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మెయ్యప్పన్‌ మాట్లాడుతూ... రాహుల్‌ గాంధీ ప్రధాని కాగానే తొలి సంతకం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఫైలుపై చేస్తారన్నారు. మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ... దేశ బడ్జెట్‌ రూ.45 లక్షల కోట్లు అయితే, 100 మంది ధనవంతుల సంపద రూ.55 లక్షల కోట్లని చెప్పారు.

ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం, పల్లంరాజు, మాజీ మంత్రులు కనుమూరి బాపిరాజు, రఘువీరారెడ్డి, కొణతాల రామకృష్ణ, నేతలు మస్తాన్‌వలీ, కొప్పుల రాజు, కొలనుకొండ శివాజీ, సుంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో కేవీపీ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. వైఎస్సార్‌ మరణానంతరం ఆయన జగన్‌ ఏర్పాటు చేసిన వైసీపీలో చేరతారని వార్తలు వచ్చాయి. అయితే కేవీపీ కాంగ్రెస్‌ లోనే ఉండిపోయారు. పలుమార్లు జగన్‌ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. కేవీపీ కోవర్టు అని కాంగ్రెస్‌ లో ఉంటూ జగన్‌ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వీహెచ్‌ హనుమంతరావు లాంటి నేతలు అప్పట్లో విమర్శించారు.