Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంఎల్సీ ఇరుక్కున్నట్లేనా ?

By:  Tupaki Desk   |   26 Jan 2022 4:40 AM GMT
టీడీపీ ఎంఎల్సీ ఇరుక్కున్నట్లేనా ?
X
క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. రికార్డులను ట్యాంపరింగ్ చేసిన ఆరోపణలపై టీడీపీ ఎంఎల్సీ, మాజీ ఉద్యోగ నేత అశోక్ బాబుపై సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. లోకాయుక్త ఆదేశాల ప్రకారం సీఐడీ కేసులు నమోదు చేసింది. కేసులు నమోదు చేసిందంటే రేపే ఎల్లుండో విచారణ పేరుతో అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇంతకీ అశోక్ బాబుపై ఎందుకు కేసులు నమోదైనట్లు ?

ఎందుకంటే అశోక్ పూర్వాశ్రమంలో కమర్షియల్ ట్యాక్స్ అధికారి గా పనిచేశారు. ఆ సమయంలో తన ప్రమోషన్ కోసమని సర్వీసు రిజిస్టర్ ను ట్యాంపరింగ్ చేశారట. ప్రమోషన్ కోసమని చదవకపోయినా బీకామ్ డిగ్రీ చదివినట్లు సర్వీసు రిజిస్టర్ లో మార్పులు చేశారట. తప్పుడు విద్యార్హతలను సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేశారట. తర్వాత ప్రమోషన్ కూడా అందుకున్నారు. సర్వీసు విషయం ఇట్లుంటే ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారట ఆయన.

అప్పట్లో కొందరు ఉద్యోగుల సంఘాల నేతలు, జర్నలిస్టులుగా పనిచేసిన వారిని తీసుకుని అశోక్ ప్రత్యేక విమానంలో కర్నాటకకు వెళ్ళినట్లు ఆప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. సర్వీసు రిజస్టర్ ట్యాంపరింగ్, కర్నాటక ఎన్నికల్లో ప్రచారం చేయటమన్నది సర్వీసు నిబంధనలకు పూర్తి విరుద్ధం.

చంద్రబాబు హయాంలోనే అశోక్ బాబుపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిగింది. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో విచారణ ఆగిపోయింది. వెంటనే అశోక్ బాబు వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకున్నారు. విచారణలో భాగంగా కేసు నుండి తప్పించుకునేందుకే అశోక్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అశోక్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవటం, వెంటనే టీడీపీ తరపున ఎంఎల్సీ అయిపోవటం చాలా స్పీడుగా జరిగిపోయింది.

అయితే తర్వాత ప్రభుత్వం మారింది. దాంతో కమర్షియల్ ట్యాక్స్ అధికారుల సంఘం నేత మెహర్ కుమార్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ జరిపిన లోకాయుక్తకు మెహర్ అన్ని ఆధారాలను అందించారు. దాంతో ఆధారాలను పరిశీలించిన లోకాయుక్త అశోక్ బాబుపై కేసులు నమోదు చేసి విచారణ జరపాలని ఏపీసీఐడీని ఆదేశించింది. నిజానికి టీడీపీ హయాంలోనే ఇరుక్కోవాల్సిన అశోక్ అప్పుడు తప్పించుకున్నారు. అలాంటిది లోకాయుక్త ఆదేశాలతో ఇపుడు అశోక్ పూర్తిగా ఇరుక్కునట్లే అనిపిస్తోంది.