Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: నారాయణ కూడా జంపేనా?

By:  Tupaki Desk   |   10 Jun 2020 11:30 AM GMT
బ్రేకింగ్: నారాయణ కూడా జంపేనా?
X
బెల్లం చుట్టూ ఈగలు.. అధికారం చుట్టూ రాజకీయ నాయకులు ఎప్పుడూ చేరుతుంటారు. ఏపీలో మన టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్ రావు అయితే ఏపార్టీ అధికారంలోకి వస్తుందో అంచనావేసి మరీ ఆ పార్టీలో చేరి ప్రతీసారి మంత్రి పదవి అనుభవించేవారు. కానీ ఇప్పుడు జగన్ ఆయన ఆశలపై నీళ్లు చల్లడంతో టీడీపీలో ఉండలేక.. వైసీపీలోకి రాలేక మౌనంగా ఉంటున్నారు.

ఇక తెలంగాణలోనూ అంతే.. ఉద్యమ సమయంలో కేసీఆర్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన తలసాని, దానం నాగేందర్ లాంటి వాళ్లు ఇదే టీఆర్ఎస్ లో చేరి పదవులు అనుభవిస్తున్నారు. ఇక ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షంతో దాడులు, వారి దెబ్బలను కాచుకొని ఐదేళ్లు తట్టుకొని నిలబడాలి. అప్పటికి వాళ్ల వ్యాపారాలన్నీ సంకనాకిపోతాయన్న భయం నేతల్లో ఉంటుంది. అందుకే గెలవగానే ఏ ఎమ్మెల్యే, ఎంపీ అయినా అధికార పార్టీలోకి జంప్ చేస్తుంటారు. ఇలా చేరిన వారిని ప్రజలు అభివృద్ధి కోణంలో లైట్ తీసుకుంటుండడంతో ఈ తంతు జరుగుతూనే ఉంటోంది.

ఏపీలోనూ అంతే.. చంద్రబాబు ఉండగా చక్రం తిప్పిన నేతలంతా ఇప్పుడు టీడీపీ ఓడిపోగానే పక్కకు జరుగుతున్నారు. కొంచెం కొంచెంగా టీడీపీ అధిష్టానం మీద అసంతృప్తి సెగలు కురిపిస్తున్నారు. వైసీపీలో చేరితే అధికారం అండతో ఈ ఐదేళ్లు ఢోకా ఉండదని టీడీపీ నేతలంతా అటే దారిపడుతున్నారు.

తాజాగా నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి, చంద్రబాబు అనుంగ అనుచరుడు నారాయణ కూడా తన ప్రధాన బిజినెస్ అయిన విద్యావ్యాపారాన్ని కాపాడుకోవడానికి వైసీపీ బాట పట్టేందుకు రెడీ అవుతున్నాడట.. ఏపీలో జగన్ ఇంగ్లీష్ మీడియంలు ప్రవేశపెట్టి సర్కార్ విద్యను పటిష్టం చేస్తూ ప్రైవేటు విద్యను అణగదొక్కేస్తున్నాడు. కోట్లలో వ్యాపారం చేసే నారాయణ, శ్రీచైతన్య సహా కార్పొరేట్ సంస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. అందుకే జగన్ పార్టీలోకి చేరితే ఈ బాధలు తప్పుతాయని నారాయణ కూడా టీడీపీ నుంచి తట్టా బుట్టా సర్దేయడానికి రెడీ అవుతున్నాడనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.

ఇప్పటికే తన నియోజకవర్గంలోని తన ప్రధాన అనుచరులను వైసీపీలో చేరాలని నారాయణ ఒత్తిడి చేస్తున్నారని నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. తన విద్యాసంస్థలు కాపాడుకోవడానికైనా నారాయణ వైసీపీలోకి జంప్ చేస్తాడేమోనని పలువురు భావిస్తున్నారట.. వైసీపీ పెద్దలు కూడా నారాయణతో సంప్రదింపులు జరుపుతున్నారని భోగట్టా. ఇలా అవసరార్థం నారాయణ కూడా వ్యాపారం నిలబెట్టుకోవడానికి పార్టీలు మారక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆయన అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు.