Begin typing your search above and press return to search.

ESI స్కామ్ పై స్పందించిన అచ్చెన్నాయుడు !

By:  Tupaki Desk   |   21 Feb 2020 10:45 AM GMT
ESI స్కామ్ పై స్పందించిన  అచ్చెన్నాయుడు !
X
తెలంగాణ ఈఎస్ ఐ స్కామ్ తరహాలో ఏపీ ఈఎస్‌ ఐ లోనూ భారీ కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌ ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ బయటపెట్టింది.. గత ఆరేళ్లలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని నిర్ధారించారు. ఈఎస్‌ ఐ లేని కంపెనీలు నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్లు బయటపెట్టారు. అయితే, ఈ స్కామ్‌ లో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని నివేదికలో పొందుపర్చడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపుతోంది. నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని ప్రస్తావించగా.. టెలీ హెల్త్ సర్వీసెస్ పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో ఆయన ఒత్తిడి చేశారని తెలిపారు. నామినేషన్ల పద్ధతిలో మెడిసిన్స్, ల్యాబ్ కిట్లను పూర్తిగా అందజేయాలని కోరూతూ అచ్చెన్నాయుడు, అప్పట్లో డైరెక్టర్ రవికుమార్‌ కు లేఖ రాశారు. దీంతో, ఎలాంటి కొటేషన్ లేకుండా.. నామినేషన్ పద్ధతిలో టెలీ హెల్త్ సర్వీసెస్‌కు ఇచ్చినట్టుగా తెలిపారు. దీంతో రూ.150 కోట్ల వరకు ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని అధికారులు తెలిపారు.


అయితే , ఈ స్కామ్ వ్యవహారం పై తాజాగా టీడీపీ నేత అచ్చెన్నాయుడు స్పందించారు. తాను తప్పు చేయలేదని, జీవితంలో చేయబోనని స్పష్టంచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకే టెలీ హెల్త్ సర్వీసెస్‌ కు నామినేషన్ పద్దతిలో కేటాయించాలని తాను లేఖ రాసినట్టు వివరించారు. మిగతా రాష్ట్రాల ఏ విధానాలు అవలంభించాయో అలా వ్యవహరించాలని సూచించానని తెలిపారు. కానీ కొందరు పనిగట్టుకొని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి 1027 ఏప్రిల్ వరకు తాను కార్మిక శాఖ మంత్రిగా పని చేశానని అచ్చెన్నాయుడు తెలిపారు. 2016 డిసెంబర్‌ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నిరాష్ట్రాల మంత్రులు, ప్రధాన కార్యదర్శుల తో సమావేశం నిర్వహించారని గుర్తుచేశారు. భేటీలో టెలీ హెల్త్ సర్వీసెస్‌ కు నామినేషన్ పద్ధతి లో మందులు ఇవ్వాలని సూచించారని తెలిపారు.

టెలిహెల్త్ సర్వీసెస్ ను తెలంగాణ లో అమలు చేస్తున్నారని అదికారులు చెప్పారని, అప్పుడు ఆ ప్రకారమే చేయాలని చెప్పానని,అది తన బాద్యత అని ఆయన అన్నారు.దీనిని బూతద్దంలో చూపిస్తున్నారని అన్నారు. అచ్చెన్నాయుడు తప్పు చేయరని, కావాలంటే పది మందిని అడుక్కుని బతుకుతాం తప్ప తప్పు చేయబోనని ఆయన అన్నారు. అదికారులు పద్దతులు చూసుకుని చేయాలి తప్ప, తాను ఎవరికి సిఫారస్ చేయలేదని ఆయన అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చని సూచించారు. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.