Begin typing your search above and press return to search.

2 నుంచి 3 వేలమంది సైనికుల్ని చంపేశా ..ఎల్టీటీఈ మాజీ నేత కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   23 Jun 2020 4:40 PM IST
2 నుంచి 3 వేలమంది సైనికుల్ని చంపేశా ..ఎల్టీటీఈ మాజీ నేత కీలక ప్రకటన
X
రెండు నుండి మూడు వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని చంపానంటూ వేర్పాటువాద సంస్థ లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం(ఎల్ ‌టీటీఈ) మాజీ డిప్యూటీ నేత కరుణ అమ్మన్‌ కీలక ప్రకటన చేశాడు. ఈ ప్రకటనపై శ్రీలంక పోలీసులు దర్యాప్తున కు ఆదేశించారు. ఎల్‌ టీటీఈ లో క్రియాశీలకం గా ఉన్నప్పుడు ఎలిఫెంటా పాస్ వద్ద ఓ రాత్రి జరిగిన పోరులో రెండు వేల నుంచి మూడు వేల మంది భద్రతా సిబ్బందిని హతమార్చాను. కిలినోచిలో చాలా మంది చంపాను. ఈ సంఖ్య శ్రీలంక ప్రభుత్వం ప్రకటిస్తున్న కరోనా మరణాలు కంటే చాలా ఎక్కువ’ అని అమ్మన్‌ గతవారం ఓ ఎన్నికల ర్యాలీ లో ప్రకటించినట్టు శ్రీలంక పోలీసులు తెలిపారు.

దేశ చట్టాలను ధిక్కరించేలా చేసిన ఇలాంటి వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోమని, చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని శ్రీలంక రక్షణ మంత్రి రువాన్‌ విజయవర్ధనె చెప్పుకొచ్చారు. ఎల్టీటీఈలో కరుణ అమ్మన్ కీలకంగా వ్యవహరించారు. అయితే, 2004లో ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించారు. అమ్మన్ తన అనుచరులతో కలిసి ఎల్టీటీఈ వీడిన తర్వాత ఆ సంస్థ పూర్తిగా బలహీనమయ్యింది. దీంతో 2009లో భద్రతా దళాలు ఆ సంస్థను తుద ముట్టించాయి. అఖిల ఇళాంకి ద్రవిడ మహా సభ పార్టీ తరఫున 2010 ఎన్నికల్లో గెలిచి, మహేంద్ రాజపక్సే క్యాబినెట్‌ లో డిప్యూటీ మంత్రిగా చేరారు.

కాగా.. శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్సే ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఆరు నెలల ముందే మార్చి 2న పార్లమెంట్‌ను రద్దుచేయడంతో ఏప్రిల్ 25న ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ వెల్లడించింది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి శ్రీలంకలో మొదలుకావడంతో జూన్ 20 వరకు రెండు నెలల పాటు ఎన్నికలను వాయిదా వేశారు, వైరస్ ఇంకా తగ్గకపోవడంతో ఎన్నికలను ఆగస్టు 5కు వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.