Begin typing your search above and press return to search.

పెద్దిరెడ్డిని టార్గెట్ చేసిన మాజీ సీం... బాబు ఫుల్ హ్యాపీ...?

By:  Tupaki Desk   |   19 Nov 2022 11:53 AM GMT
పెద్దిరెడ్డిని టార్గెట్ చేసిన మాజీ సీం... బాబు ఫుల్ హ్యాపీ...?
X
చిత్తూరు జిల్లా రాజకీయాల్లో వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అత్యంత కీలకంగా ఉన్నారు. గత రెండు దశాబ్దాలుగా ఆయన జిల్లాను శాసిస్తున్నారు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. తన ఇంట్లో నుంచే తమ్ముడిని, కుమారుడిని గెలిపించుకున్నారు. తాను మంత్రిగా జగన్ క్యాబినేట్ లో అయిదేళ్ళూ కొనసాగేలా చేసుకున్నారు. లోక్ సభలో తన కుమారుడు మిధున్ రెడ్డిని లీడర్ గా జగన్ చేత ఎంపిక చేయించుకున్నారు.

ఇక రాజకీయంగా సామాజికంగా ఆర్ధికంగా చిత్తూరు జిల్లాలో జగన్ కి కొండంత అండగా పెద్దిరెడ్డి ఉంటున్నారు. జగన్ ఈసారి చంద్రబాబునే కుప్పంలో ఓడిస్తాను అని అంటున్నారు అంటే దాని వెనక పెద్దిరెడ్డి ఉన్నారు. ఆయన కుప్పం ని ఒక కంటకనిపెడుతూ అక్కడ టీడీపీకి కూశాలు కదిలిపోయేలా చేస్తున్నారు.

అలాంటి పెద్దిరెడ్డి గతంలో కాంగ్రెస్ లో ఉన్నపుడు కూడా జగన్ సిఫార్సుతో వైఎస్సార్ క్యాబినేట్ లో మంత్రి అయ్యారు. అదే జిల్లాకు చెందిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టడంలోనూ ఆయన విజయం సాధించారు. నిజానికి కిరణ్ కుమార్ రెడ్డిదీ రాజకీయ కుటుంబమే. ఆయన తండ్రి అరవై దశాబ్దం నుంచి కాంగ్రెస్ తరఫున రాజకీయాలు చేస్తూ వచ్చారు.

ఇక కిరణ్ ది మూడు దశాబ్దాల రాజకీయం. వైఎస్సార్ కి అత్యంత సన్నిహితుడు అయిన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి అవుతారు అని అంతా అనుకున్నారు. కానీ ఆయన స్పీకర్ గానే మిగిలిపోయారు. ఇదంతా పెద్దిరెడ్డి చేసిన రాజకీయం అని కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో అంటూండేవారు. అయితే ఇన్నాళ్ళకు అది బయటపెట్టుకున్నారు. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ ఓటీటీ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షోకి గెస్ట్ గా వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఆనాటి సంగతులు అన్నీ ఒకసారి వల్లె వేశారు.

వైఎస్సార్ క్యాబినేట్ లో ఉన్న ఒక సీనియర్ మంత్రి వైఎస్సార్ ని తప్పుతోవ పట్టించారు అని కూడా తాజాగా విడుదల అయిన ప్రోమోలో కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మరి ఆయన చెప్పినది పూర్తిగా పెద్దిరెడ్డి గురించే అని అంటున్నారు. మొత్తానికి పెద్దిరెడ్డిని కిరణ్ టార్గెట్ చేశారని చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో గత వైభవం కోసం నల్లారి కుటుంబం చూస్తోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో ఇపుడు పెద్దగా యాక్టివ్ గా లేరనే అంటున్నారు.

ఆయన కాంగ్రెస్ లో ఉన్నా కూడా అక్కడ కూడా అలికిడి లేదు. అయితే తన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిని టీడీపీలోకి పంపించారు. పీలేరు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కిషోర్ కుమార్ రెడ్డిని ఈసారి గెలిపించుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి చూస్తారని అంటున్నారు. అదే టైంలో జిల్లాలో తన ప్రత్యర్ధి గా ఉన్న పెద్దిరెడ్డిని కూడా ఓడించాలని, ఆయన బలాన్ని తగ్గించాలని చూస్తారని అంటున్నారు.

ఈ నేపధ్యంలో పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా నల్లారి గట్టిగానే పావులు కదుపుతున్నారు అని అంటున్నారు. అసలే చంద్రబాబు పెద్దిరెడ్డి మీద గురి పెట్టి ఉంచారు. ఇపుడు ఆయనకు నల్లారి వారు కనుక సాయం చేస్తే పెద్దిరెడ్డి చిత్తూరు కోటకు బీటలు వారుతాయా అన్న చర్చ అయితే ఉంది.

కాంగ్రెస్ లో ఉన్నట్లా లేనట్లా అనంట్లుగా ఉన్న నల్లారి వారు వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ జీవితాన్ని ఏమైనా టీడీపీ నుంచి రీ స్టార్ట్ చేస్తారా అన్న చర్చ కూడా ఉంది. బాలయ్యకు క్లాస్ మేట్ అయిన నల్లారి వారు చంద్రబాబుకు కూడా వైఎస్సార్ మరణాంతరం మంచి దోస్త్ అయిపోయారు అని చెబుతారు. ఏది ఏమైనా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డిని దెబ్బ కొట్టేందుకు నల్లారి వారు రెడీ అయ్యారనే అంటున్నారు. దాంతో చంద్రబాబు ఫుల్ హ్యాపీ అని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి నయా రాజకీయం ఏ రూపంలో అన్నది చూడాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.