Begin typing your search above and press return to search.

వైసీపీ గుండెల మీద కుంపటి... రెండు నెలల పాదయాత్ర

By:  Tupaki Desk   |   12 Sep 2022 4:31 PM GMT
వైసీపీ గుండెల మీద కుంపటి... రెండు నెలల  పాదయాత్ర
X
ఏపీలో ఇపుడు మహా పాదయాత్ర స్టార్ట్ అయింది. ఇది దాదాపుగా రెండు నెలల పాటు సాగనుంది. దాదాపుగా తొమ్మిది వందల కిలోమీటర్ల దూరం ఉంది. అలాగే పదహారు జిల్లాలను ఈ పాదయాత్ర దాటనుంది. ఇక ఈ పాదయాత్రలో కోస్తా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రా జిల్లాలు ఉన్నాయి. ఇప్పటిదాకా విశాఖ రాజధాని అంటూ ఎందరూ ఊరించినా ఆ ప్రాంతం అయితే పెద్దగా రియాక్ట్ అయింది లేదు. మా వరకూ వస్తే ఏదైనా ఓకే. లేకపోతే లేదు అన్న నిర్లిప్త భావనతో ఉన్నారు.

మరో వైపు చూస్తే అమారావతి పాదయాత్ర ఉత్తరాంధ్రా మీద దండయాత్ర అని వైసీపీ మంత్రులు స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. ఇంకో వైపు చూస్తే ఉత్తరాంధ్రా వారు రాజధాని వద్దని నోరు మూసుకుని కూర్చుంటారా అని మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శిస్తున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే ఇది చంద్రబాబు చేయిస్తున్న పాదాయత్ర అంటున్నారు. మరో మంత్రి గుడివాడ అమరనాధ్ అయితే పాదయాత్రతో ఉత్తరాంధ్రాను రెచ్చగొడదామనుకుంటున్నారు అని అనేశారు.

ఏమైనా జరిగితే దానికి బాధ్యత చంద్రబాబు వహిస్తారా అని ప్రశ్నించారు. ఇక అమరావతి రైతుల పాదయాత్ర ఇపుడు ఎందుకు అంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తమ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకుందని ఆయన గుర్తు చేశారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని తాము అన్ని ప్రాంతాల ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ లోగా ఈ యాత్ర చేయడం వల్ల ఎవరికి మేలు చేకూరుతుంది అని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ వెనకాల ఉండి ఈ యాత్రను నడిపిస్తున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ఈ యాత్ర ప్రశాంతంగా ముగిసేలా చూస్తోందని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. శాంతిభద్రతల విషయంలో జగన్ సర్కార్ కచ్చితంగా ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను కూడా తీసుకుంటున్నామని చెప్పారు.

అయితే ఈ యాత్ర ద్వారా రాజకీయ లబ్దికే టీడీపీ చూస్తోందని ఆయన అంటున్నారు. ఇక అమరావతి రైతుల పాదయాత్రను వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మలచే ప్రయత్నాలను చేస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ నాయకులు యాత్ర ప్రారంభానికి ముందే అమరావతిలో వేడిని పుట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ సమయంలో మహా పాదయాత్రను వైసీపీ సర్కార్ పట్ల ఆగ్రహ యాత్రగా తెలుగుదేశం దాని అనుకూల మీడియా చిత్రీకరిస్తున్నాయని ఇది దారుణమని ఆయన అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి చెబుతున్న దాని బట్టి చూస్తే ప్రభుత్వం ఈ యాత్ర సజావుగా సాగాలని చూస్తోందని కానీ రాజకీయం చేయాలని వేడి పుట్టించాలని టీడీపీ కోరుకుంటోందని ఆరోపిస్తున్నారు. ఇక వైసీపీ మంత్రులు అయితే తొందరపాటుతో అన్నారా లేక ఆవేశంలో అన్నారో తెలియదు కానీ ఈ యాత్ర వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తితే దానికి చంద్రబాబుదే బాధ్యత అనేశారు.

మరి ఈ యాత్ర సజావుగా సాగిపోతే ఫరవాలేదు, గమ్యం చేరుకుని అరసవెల్లి సూర్యనారాయాణమూర్తిని ప్రార్ధించి వారి కోరికను చెప్పుకుంటే ప్రశాంతంగా ముగిసింది అనుకోవాలి. కానీ అరవై రోజుల యాత్రలో ఏమైనా అవాంఛ‌నీయ ఘటనలకు ఆస్కారం ఉందా అన్నదే సందేహంగా ఉందిపుడు. వేడి టీడీపీ వారే పుట్టిస్తున్నారు అని వైసీపీ అంటే ఈ ప్రభుత్వానికి యాత్ర సజావుగా సాగడం ఇష్టం లేదని విపక్షాలు అంటున్నారు.

కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తు ఎరగాలి. ఈ పాద‌యాత్ర సజావుగా సాగినా సాగకపోయినా విపక్షానికే లాభం. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సింది. యాత్ర పూర్తిగా సాఫీగా సాగేలా చూడాల్సింది మాత్రం అధికార వైసీపీయే. ఈ విషయంలో సహనంతో ఉండాల్సింది కూడా ఆ పార్టీ నేతలు మంత్రులే అన్న మాట వినిపిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.