Begin typing your search above and press return to search.

ఈవీఎంల‌కు బ్లూటూత్‌..గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో క‌ల‌వ‌రం

By:  Tupaki Desk   |   9 Dec 2017 12:19 PM GMT
ఈవీఎంల‌కు బ్లూటూత్‌..గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో క‌ల‌వ‌రం
X
గుజరాత్ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ సంద‌ర్బంగా అనేక ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. గుజరాత్ ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించాయి. కొన్ని చోట్ల వీవీప్యాట్లు కూడా మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. పోర్‌బందర్, సూరత్, రాజ్‌కోట్‌లో ఈవీఎంలు మొరాయిస్తున్న ఘటనలు ఎక్కువగా నమోదు అయ్యాయి. మొరాయిస్తున్న ఈవీఎంల స్థానంలో కొత్త మెషీన్లను ఏర్పాటు చేస్తున్నారు. సూరత్‌లోని వరచ్చాకు కొత్త ఈవీఎంలను వెంటనే పంపినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే బ్లూటూత్‌తో ఈవీఎంలు క‌నెక్ట్ అవ‌డం క‌ల‌క‌లంగా మారింది.

పోర్‌బందర్‌లోని కాంగ్రెస్ అభ్యర్థి కొత్త రకమైన ఫిర్యాదు నమోదు చేశారు. ఈవీఎంలు బ్లాటూత్‌తో కనెక్ట్ అవుతున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి అర్జున్ మొద్వాడియా ఫిర్యాదు చేశారు. ఈవీఎంలతో మొబైల్ బ్లూటూత్ కనెక్ట్ అవుతున్న అంశానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించారు. పోర్ బందర్ లోని శారదా మందిర్ లోని బూత్ నెంబర్ 145 - 146 - 147ల్లోని ఈవీఎం యంత్రాలకు బ్లూటూత్ - వైఫై పరికరాలు అమర్చి ట్యాపరింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప‌రిణామాల‌పై సోనియా గాంధీ రాజకీయ సలహాదారు - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ సైతం స్పందించారు. ఈవీఎంలు సక్రమంగా పని చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయని, వాటిని తక్షణమే సరిదిద్దాలని - బ్లూటూత్ - వైఫై పరికరాలు అమర్చారా అనే విషయం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ప‌రిణామం వివాదాస్ప‌దం కావ‌డంతో భారత ఎన్నికల కమిషన్ స్పందించింది. పోరబందర్ పోలింగ్ బూత్ కేంద్రాల దగ్గరకు స్వయంగా జిల్లా కలెక్టర్, ఇంజినీర్లు వెళ్లి పరిశీలించి దర్యాప్తు చేయించింది. ఈవీఎంలకు బ్లూటూత్, వైఫై పరికరాలను అమర్చడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈవీఎం ఇంజినీర్లతో చర్చించిన తరువాత ఎలాంటి బ్లూటూత్ లు అమర్చలేదు అనే విషయాన్ని తాము చెబుతున్నామని వెల్ల‌డించింది. వాస్తవానికి అది సాంకేతిక సమస్య కాదు అని, ఎలక్ట్రానిక్ ఐటమ్స్‌లో కొన్ని లోపాలు ఉంటాయని, ఓటింగ్‌ కు ఎటువంటి సమస్య రాకుండా చూస్తున్నామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఇదిలాఉండ‌గా..పోలింగ్ అనుకున్నంత సజావుగా సాగడం లేదని తెలుస్తున్నది. రాజ్‌కోట్, రాజ్‌పిప్లా, భావ్‌నగర్, పలిటానా, పోర్‌ బందర్ ప్రాంతాల్లో ఈవీఎంలు - వీవీప్యాట్‌ లు మొరాయించిన‌ట్లు వార్తలు వచ్చాయి. కేవలం పోర్‌ బందర్‌ లోనే 8 పోలింగ్ బూతుల్లో ఈవీఎం సమస్యలు ఉన్నట్లు తేలింది. ఇక అమ్రేలీ జిల్లాలో మరో అయిదు చోట్ల ఓటింగ్ యంత్రాలు సతాయించాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 977 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దాదాపు 2 కోట్ల 12 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జామ్‌ నగర్‌ స్థానంలో అత్యధికంగా 27 మంది పోటీలో ఉండగా.. జగదీయా, గందేవి లలో అతి తక్కువగా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు.