Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డ లేఖ...ఆధారాలు మాయం...!

By:  Tupaki Desk   |   24 April 2020 1:35 PM GMT
నిమ్మగడ్డ లేఖ...ఆధారాలు మాయం...!
X
కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ రాసిన‌ లేఖ...ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తన ప్రాణాలకు హాని ఉందంటూ...కేంద్ర భద్రత కోరిన రమేష్...ఆ లేఖ మాత్రం తాను రాయలేదని ఖండించారు. లేఖ వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్న నిమ్మగడ్డ రమేష్ వ్యవహార శైలిపై ఏపీ సర్కార్ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కింది. ఈ నేపథ్యంలోనే కొత్త ఆర్డినెన్స్ రావడం...మద్రాసు హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ఏపీ ఎస్ ఈసీగా బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. తన పదవీ కాలం ముగిసిన తర్వాతే తాజా ఆర్డినెన్స్ వర్తిస్తుందని రమేష్ కుమార్...హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఏపీ సర్కార్ కౌంటర్ కూడా దాఖలు చేసింది. ఇదిలా ఉండగానే, తాజాగా కేంద్రానికి నిమ్మగడ్డ రాసిన లేఖ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ లేఖకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేసినట్టు నిమ్మగడ్డ అడిషనల్ పీఎస్‌ సాంబ మూర్తి సీఐడీ అధికారుల ఎదుట అంగీకరించారన్న వార్త కలకలం రేపుతోంది.

నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ లేఖలో నిగ్గు తేలాల్సిన మూడు అంశాలు ఉన్నాయని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ పేరుతో ఉన్న ఆ లేఖపై సంతకం చేసింది ఎవరు? ఆ లేఖను ఏ ఐపీ అడ్రస్ ద్వారా హోం శాఖ అధికారికి మెయిల్ చేశారు? ఆ లేఖను ఎక్కడ, ఎవరు డ్రాఫ్ట్ చేశారు? అనే వాస్తవాలు సీఐడీ దర్యాప్తులో తేలుతాయని విజయసాయి సంధించిన ప్రశ్నలకు నిమ్మగడ్డ ఏపీఎస్ సాంబమూర్తి సమాధానాలిచ్చారు. ఆ లేఖను ల్యాప్ టాప్‌ లో తయారు చేసి పెన్ డ్రైవ్‌ ద్వారా డెస్క్ టాప్‌ లో వేసినట్టు సాంబ మూర్తి...సీఐడీ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ లేఖను తర్వాత వాట్సాప్ వెబ్ ద్వారా రమేష్ కుమార్‌కు పంపానని సాంబమూర్తి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ లేఖను తన మొబైల్ నుండి రమేష్ కుమార్ కేంద్రానికి పంపినట్టు తెలుస్తోంది. ఈ లేఖ పంపిన తర్వాత...సదరు ల్యాప్ టాప్‌ లో ఫైల్స్ డిలీట్ చేయడంతో పాటు, పెన్ డ్రైవ్ ధ్వంసం చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత డెస్క్ టాప్ కూడా ఫార్మాట్ చేశారని తెలుస్తోంది. నిమ్మగడ్డ లేఖకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో, ఆధారాలు ట్యాంపర్‌ చేసిన అంశంపై కేసు నమోదు చేశామని సీఐడీ డీజీ సునీల్‌ కుమార్‌ తెలిపారు. లేఖ నంబర్‌ పైన కూడా కొన్ని ఆధారాలు సేకరించామని - కేంద్రానికి రాసిన లేఖ 221 నంబర్‌ తోనే - అశోక్‌ బాబు రాసిన రెఫ్రెన్స్ లెటర్‌ కు కూడా ఉందని వారు పేర్కొన్నారు. ఈ లేఖ బయట నుంచి వచ్చే అవకాశమే లేదని ...ఇది నిమ్మగడ్డ ఆఫీసులో డ్రాఫ్ట్ అయ్యే చాన్స్ ఎక్కువగా ఉందని విజయసాయి అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఇపుడు ఆ అంచనాలే నిజమవడంతో నిమ్మగడ్డ గుట్టురట్టయినట్లయిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మరి, ఈ వ్యవహారంపై నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.