Begin typing your search above and press return to search.

అంతా చంద్రబాబే చేశారు.. అప్పుడు కొడాలి ఎక్కడున్నారు?

By:  Tupaki Desk   |   31 March 2021 11:00 AM IST
అంతా చంద్రబాబే చేశారు.. అప్పుడు కొడాలి ఎక్కడున్నారు?
X
అంతా మీరే చేశారు.. అవును.. మీరే చేశారంటూ ఒక తెలుగు సినిమాలో తండ్రిని హీరో నిలదీయటం తెలిసిందే. సినిమా సీన్ ను స్ఫూర్తిగా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది సినిమా వాసనలు ఉన్న కొడాలి నాని మాటలు వింటుంటే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా సరే.. మొత్తం చంద్రబాబుదే బాధ్యత అన్నట్లుగా మాట్లాడే నేతలకు నిలువెత్తు రూపంగా నిలుస్తారు కొడాలి నాని. సుదీర్ఘకాలం టీడీపీలో ఉండి.. ఆ తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన.. అసలుసిసలు వైసీపీ నేతలకు మించిన ఘాటు వ్యాఖ్యలతో చంద్రబాబును తిట్టిపోయటంలో ముందుంటారు.

ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎకరం అమ్మితే.. ఏపీలో మూడు ఎకరాలు కొనొచ్చంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ సర్కారుకు సూటిగా తగలటంతో పాటు.. వైసీపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్లైంది. కేసీఆర్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎవరూ సరైన కౌంటర్ ఇవ్వలేదన్న వేళ.. ఎంట్రీ ఇచ్చారు కొడాని నాని. కేసీఆర్ చేసిన వ్యాఖ్యకు సమాధానం ఇస్తున్నట్లే ఇచ్చి.. ఈ మొత్తం పాపం చంద్రబాబుదే అంటూ.. తనకు అలవాటైన ఆవుకథను మరోసారి వినిపించారు నాని.

కేసీఆర్ ను తన మంత్రివర్గంలోకి తీసుకొని ఉంటే.. టీఆర్ఎస్ పార్టీని పెట్టేవారే కాదని.. రాష్ట్ర విభజన జరిగేదే కాదన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబే అని విమర్శించిన ఆయన.. తెలంగాణలో ఎకరం అమ్మితే.. ఏపీలో మూడెకరాలు కొనొచ్చన్న కేసీఆర్ వ్యాఖ్యలకు బాధ్యత చంద్రబాబుదేనని తేల్చేశారు.

అంతేకాదు.. ఏపీలో ప్రస్తుతం భూమి ధర ఎకరా రూ.10లక్షలకు పడిపోవటానికి కూడా చంద్రబాబే కారణమన్నారు. రాష్ట్రం అప్పుల పాలైందన్న చంద్రబాబు.. తన హయాంలో రూ.3.6లక్షల కోట్లు అప్పులు తేలేదా? అని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికలో ఐదు లక్షల మెజార్టీతో వైసీపీ విజయం సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. అంతా బాగానే ఉంది కానీ కొడాలి నాని.. ఎప్పుడూ బాబును విమర్శించే మీరు.. మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు సంధించుకుంటే మరింత బాగుంటుంది. అవేమంటే..

- కేసీఆర్ ను మంత్రివర్గంలోకి తీసుకోని వేళ మీరు ఎక్కడ ఉన్నట్లు?
- కేసీఆర్ కొత్త పార్టీ పెట్టిన వేళలో.. భవిష్యత్తులో విభన జరుగుతుందని మీరెందుకు చెప్పనట్లు?
- విభజన కు ముందు వరకు మీరున్న పార్టీలో ఏరోజైనా పార్టీ అధినేతను తప్పుపట్టటం కానీ.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లోని లోపాల్ని ఎత్తి చూపటం లాంటివి ఎప్పుడైనా చేశారా?
- తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో మూడు ఎకరాలు కొనొచ్చన్న కేసీఆర్ మాటలకు కారణం బాబే అంటున్నారు సరే. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీలో భూముల ధరలు ఎంత ఉండేవి? బాబు ఓడిపోయిన తర్వాత అమరావతితో సహా ఏపీలో భూముల ధరలు ఎంతలా పడిపోయాయి?
- నిజమే.. మీరన్నట్లు ఏపీలో భూముల ధరలు తగ్గిపోవటానికి చంద్రబాబే కారణం. ఎందుకంటే.. ఆయన ఎన్నికల్లో ఓడిపోవటం వల్లనే కదా? అదే ఓడిపోయి ఉండకపోతే.. ఏపీలో భూముల ధరలు కంటిన్యూ అయ్యేది. అప్పుడు కేసీఆర్ నోటి నుంచి ఈమాట వచ్చేది కాదు. మీరుకూడా చంద్రబాబును తప్పు పట్టే వారు కాదు. అంతేకదా?