Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ వేసుకోకుంటే మద్యం కట్

By:  Tupaki Desk   |   3 Sept 2021 5:00 PM IST
కరోనా వ్యాక్సిన్ వేసుకోకుంటే మద్యం కట్
X
కరోనాను తరిమికొట్టాలంటే అందరికీ వ్యాక్సిన్ వేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. నివారణ, మందులు లేని ఈ మహమ్మారిని ముందస్తుగా వ్యాక్సిన్ తీసుకొని మాత్రమే కంట్రోల్ చేయగలం.. అందుకే ప్రభుత్వాలు ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రజలకు ఆఫర్లు కూడా ఇస్తున్న పరిస్థితి నెలకొంది. అమెరికాలో అయితే డాలర్ల నుంచి మద్యం వరకూ ఉచితంగా ఇచ్చేస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారికే రేషన్ సరుకులు.. వ్యాక్సిన్ వేయించుకుంటేనే గ్యాస్ బుక్ చేసుకునే సదుపాయం అంటూ చాలా రకాల కండీషన్లు విన్నాం.. తాజాగా వ్యాక్సిన్ వేయించుకుంటేనే మద్యం కొనుగోలుకు అర్హత అంటూ కొత్త లింకు పెట్టారు. అయితే ఇది మనదగ్గర కాదులెండి..

తమిళనాడులో ప్రస్తుతం ఈ కొత్త నిబంధన అమలు చేస్తున్నారు. నీలగిరి జిల్లాలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. భారత్ లో వ్యాక్సిన్ నిర్బంధం కాదు.. అలాగని స్వచ్ఛందంగా జనాలు వస్తారా? అంటే అదీ లేదు. వ్యాక్సిన్ కొరత ఉన్నప్పుడు మాత్రం గుంపులు గుంపులుగా చేరి హడావుడి చేస్తారు.

ఇప్పుడు దేశంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరికి వారు మాకెందుకులే అంటూ సైలెంట్ గా ఉంటున్నారు. ఈ నిర్లక్ష్యం కొనసాగితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. మూడో ముప్పు తప్పదు అనే ఆందోళన ఉంది. అందుకే ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కొత్త నిబంధనలు తెరపైకి తెస్తున్నాయి. ఇది కూడా అలాంటి కండీషనే కావడం గమనార్హం.

కర్ణాటకలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారికే రేషన్ సరుకులు ఇచ్చేలా నిబంధన పెట్టారు. దీంతో రేషన్ కోసం చాలా మంది వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇప్పుడు ఇదే రూల్ తమిళనాడులో మందుబాబులకు అమలు చేస్తున్నారు.

తమిళనాడులో నీలగిరి జిల్లా అధికారులు మందుబాబులకు షాకిచ్చారు. ఆధార్ కార్డు, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు ధ్రువీకరణ పత్రం చూపిస్తేనే ఇకపై మందు అమ్ముతామని చెప్పారు. దీంతో చాలా మంది కంగారు పడుతున్నారు. మొదటి రోజు ఎవరో ఒకరి ద్వారా తెచ్చుకున్న మందుబాబులు ఇక లాభం లేదనుకొని వ్యాక్సిన్ వేసుకోవడానికి సెంటర్ వద్ద క్యూ కడుతున్నారు.

మొత్తం మీద వైన్ బంద్ చేస్తే కానీ మందుబాబులు వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రారు అన్న మాట.. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది.