Begin typing your search above and press return to search.

పోలవరంపై కేంద్రం డబుల్ గేమ్ ?

By:  Tupaki Desk   |   6 Aug 2021 10:41 AM IST
పోలవరంపై కేంద్రం డబుల్ గేమ్ ?
X
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పోలవరం వ్యయంపై అందరిలోను రోజురోజుకు అయోమయం పెరిగిపోతోంది. కేంద్రమేమో 2013-14 లెక్కల ప్రకారం రు. 20 వేల కోట్లే ఇస్తామని గట్టిగా చెబుతోంది. అలాగే తమదగ్గర సవరించిన అంచనాల కోసం డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) పెండింగ్ లో ఏదీ లేదని జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ పార్లమెంట్ లో చేసిన ప్రకటనతో గందరగోళం మరింతగా పెరిగిపోయింది.

పార్లమెంట్ అంచనా వ్యయానికి సంబంధించి 2018లోనే ప్రాజెక్టు సవరించిన అంచనాలు రు. 55,567 కోట్లకు జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని టెక్నికల్ అడ్వయిజరీ కమిటి ఆమోదించింది. ఆ తర్వాత కేంద్ర ఆర్ధిక శాఖ పరిధిలోని మరొ కమిటి ఈ అంచనాలను సవరించి రు. 47,725 కోట్లుగా నిర్ధారించింది. పై రెండు అంచనాల ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడుతోంది. పై రెండింటిలో ఏదో ఓ అంచనాప్రకారం నిధులు మంజూరు చేయమని కోరుతోంది.

పై అంచనాలను ఆధారం చేసుకునే జగన్మోహన్ రెడ్డి కేంద్రమంత్రులతో మాట్లాడుతున్నారు. వైసీపీ ఎంపీలు కూడా కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. నిజానికి డీపీఆర్ తెప్పించుకోవాల్సింది కేంద్రమంత్రే. అయితే తాజాగా బయటపడిన విషయం ఏమిటంటే పోలవరంకు సంబంధించిన ఎలాంటి అంచనాలైనా, విషయం ఏదైనా తమకు పంపకుండా పెండింగ్ లోనే ఉంచేయమని స్వయంగా జలశక్తి శాఖ ఉన్నతాధికారులే చెప్పారట. దాంతో అంచనా వ్యయాల ఫైలు జలశక్తి టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ, ఆర్ధికశాఖ దగ్గరే పెండింగ్ లో ఉంది.

పైన రెండు మంత్రిత్వ శాఖల్లో జరుగుతున్నది చూసిన తర్వాత పోలవరంపై కేంద్రమే డబుల్ గేమ్ ఆడుతోందని బయటపడింది. సవరించిన అంచనాలు సబబనిపిస్తే వెంటనే ఆమోదించి నిధులు మంజూరు చేయాలి. లేదనిపిస్తే అదే విషయాన్ని చెప్పేసి ఫైలును తిరస్కరించాలి. అంతేకానీ జగన్, ఎంపిలడిగినపుడేమో సానుకూలంగా స్పందించి తర్వాత అంచనాల ఫైలును తమ దగ్గరకు తీసుకురావద్దని చెప్పడమే కాకుండా డీపీఆర్ ఏదీ పెండింగ్ లో లేదని ప్రకటించటమంటే డబల్ గేమ్ కాక మరేమిటి ?