Begin typing your search above and press return to search.

ఎవర్‌గ్రాండ్...కుప్పకూలిన చైనా రియల్ ఎస్టేట్

By:  Tupaki Desk   |   22 Sept 2021 1:01 PM IST
ఎవర్‌గ్రాండ్...కుప్పకూలిన చైనా రియల్ ఎస్టేట్
X
కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పేల్చడానికి చైనా మరో బాంబును సిద్ధం చేసింది. 2008లో 600 బిలియన్ డాలర్లకు దివాలా తీసిన అమెరికాకు చెందిన లేమన్ బ్రదర్స్ తర్వాత ఇది అతిపెద్ద సంక్షోభంగా మారనుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాకు చెందిన ప్రముఖ రియాల్టీ సంస్థ ఎవర్‌గ్రాండ్ దివాలా దిశగా ఉంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 300 బిలియన్ డాలర్ల (రూ.22 లక్షల కోట్లకు పైగా) మేర చెల్లింపులు జరపాల్సి ఉంది. చైనా జంక్ బాండ్స్ ఈల్డ్ ఒక్కసారిగా 14.4 శాతానికి పెరిగింది.

ఇది ఆందోళన కలిగించే అంశం. 2008లో ఆర్థిక సంక్షోభం ఇప్పటికీ అందరి కళ్లముందు మెదులుతోంది. ఇప్పుడు మరోసారి ఎవర్ గ్రాండ్ కారణంగా మరోసారి తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రిటైల్ ఇన్వెస్టర్లు ఆందోళనగా ఉన్నారు. ఇటీవలి వరకు మంచి పరపతి రేటింగ్ ఉన్న ఈ కంపెనీ రుణ పత్రాల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. ఇలా ఇన్వెస్ట్ చేసినవారిలో కొంతమంది కంపెనీ ప్రధాన కార్యాలయం వద్ద ఆత్మహత్యలకు కూడా సిద్ధం కావడం గమనార్హం.

ఏ క్షణంలో అయినా ఈ కంపెనీ దివాళా తీసే అవకాశం ఉండటంతో చైనాలోని రియల్ ఎస్టేట్ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు వాటిని ఉపసంహరించుకుంటున్నారు. దీంతో ఓ వెలుగు వెలిగిన దిగ్గజ రియల్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుదేలయ్యారు. లక్షల కోట్ల రూపాయలు క్షణాల వ్యవధిలో హాం ఫట్ అయ్యింది. చైనాకు చెందిన సివిక్ హోల్డింగ్ గ్రూప్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాని సంపద గంటల వ్యవధిలో రూ.7300 కోట్లు నష్టపోయాడు. సోమవారం ఉదయం 1.3 బిలియన్లుగా ఉన్న జాంగ్ యునాన్ లింగ్ సంపద మధ్యాహ్నం కల్లా కేవలం 250.7 మిలియన్ డాలర్లకు చేరింది.

చైనాలో వరసగా రియల్ ఎస్టేట్ కంపెనీలు నష్టాలు ఎదుర్కొంటుండటంతో ఇన్వెస్టర్లు ఇతర రంగాలపై దృష్టిసారిస్తున్నారు. 2008లో లేమన్ బ్రదర్స్ దివాలా తీసింది. దీంతో అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఎవర్ గ్రాండ్ దివాలా అంచున ఉండటంతో మరోసారి ఆర్థిక సంక్షోభం తలెత్తే పరిస్థితి కనిపిస్తోందని నిపుణుల ఆందోళన. ప్రాజెక్టుల పరంగా, ఆర్థిక కార్యకలాపాల పరంగా ఎవర్ గ్రాండ్ చేపట్టినవి ఎక్కువే. ఈ సంస్థ జారీ చేసిన బాండ్స్ పైన సెప్టెంబర్ 23వ తేదీన 80 మిలియన్ డాలర్ల వడ్డీని చెల్లించాలి. కానీ దీనిని చెల్లించలేమని కూడా ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లు షాక్ అయ్యారు. 2023 మిడిల్ నాటికి 100 బిలియన్ డాలర్ల (రూ.7.5 లక్షల కోట్లు) రుణాలు తీర్చాలని భావిస్తోంది కానీ, కానీ సరైన ప్రణాళిక లేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు 8 బిలియన్ డాలర్లను మాత్రమే సమీకరించింది.

ఎవర్ గ్రాండ్‌ను సంక్షోభం నుండి బయటపడేసేందుకు చైనా ప్రభుత్వం చేస్తుందనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎవర్ గ్రాండ్ గతంలోనే పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది. దీంతో పీపుల్స్ బ్యాంక్ ఆప్ చైనా, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ విచ్చలవిడిగా రుణాలు తీసుకోకుండా గత సంవత్సరం(2020)లో కళ్లెం వేసింది. గత జూన్ నాటికి ఎవర్ గ్రాండ్ త్రీరెడ్ లైన్స్ నిబంధనలను అందుకోలేదు. అప్పులపై చైనా కొత్త నిబంధనల నేపథ్యంలో ఎవర్ గ్రాండ్ వంటి కంపెనీలు అప్పులు చెల్లించడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో చైనా ప్రభుత్వం ఆదుకుంటేనే పరిస్థితి సద్దుమణిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఎవర్ గ్రాండ్ దివాలా తీస్తే చైనాలో ఖాళీగా ఉన్న 6.5 కోట్ల ఇళ్ల ధరల్లో పతనం ప్రారంభమవుతుంది. చైనీయుల సంపదలో చాలా భాగం రియాల్టీ రంగంలో ఉంది. ఎవర్ గ్రాండ్ దివాలా తీస్తే చైనీయుల వ్యయాలు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంటుంది. చైనా బాండ్ మార్కెట్ పైన ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. చైనా జీడీపీతో పోలిస్తే ఇప్పుడున్న 92 ట్రిలియన్ డాలర్ల అప్పు 353 శాతం ఎక్కువ. రియాల్టీ రంగం మరింత మందగిస్తే చైనాకు ఆర్థికంగా పెను ఇబ్బందులే. చైనా వద్ద 1 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అమెరికా బాండ్స్ ఉన్నాయి.