Begin typing your search above and press return to search.

ఫ్యాబ్- 4లోని అతడూ కెప్టెన్సీ వదిలేశాడు.. అంతా చిత్రంగా

By:  Tupaki Desk   |   15 Dec 2022 1:30 PM GMT
ఫ్యాబ్- 4లోని అతడూ కెప్టెన్సీ వదిలేశాడు.. అంతా చిత్రంగా
X
విరాట్ కోహ్లి (భారత్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), జో రూట్(ఇంగ్లండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా).. సమకాలీన క్రికెట్ లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ ఎవరంటే ఈ నలుగురి పేర్లే చెబుతారు. వీరందరి మధ్యనా ఒక పోలిక కూడా ఉంది. 2008 అండర్ 19 ప్రపంచ కప్ ఆడిన వారి దేశ జట్లలో సభ్యులు. దాదాపు సమ వయస్కులు కావడంతో ఇది సాధ్యమైంది. అయితే, మరో విశేషమేమంటే.. అందరూ అంతర్జాతీయ క్రికెట్ కు ఎదిగి నిలదొక్కుకుని తమ దేశాలకు సారథులు అయ్యారు. ఇంకా చెప్పాలంటే నలుగురూ ఒకేసారి వారి జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించారు. అందులోనూ.. మూడు ఫార్మాట్లు (టెస్టులు, వన్డేలు, టి20లు)లోనూ సారథులు వీరే. 2014-21 మధ్య ఇది జరిగింది. అయితే, ఇప్పుడు ఈ నలుగురిలో ఎవరూ టెస్టు కెప్టెన్ గా లేరు. చిట్టచివరిగా విలియమ్సన్ కూడా సారథ్యం వదులుకున్నాడు.

అనూహ్యంగా ఒక్కొక్కరు ఈ నలుగురిలో ముందుగా కెప్టెన్ అయినది.. కెప్టెన్సీ పోగొట్టుకున్నదీ స్టీవ్ స్మిత్. 2018 దక్షిణాఫ్రికా పర్యనలో బాల్ ట్యాంపరింగ్ కారణంగా స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ వదులుకోవాల్సి వచ్చింది. ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న అతడు ఇప్పటికీ పూర్తి స్థాయి కెప్టెన్ కాలేదు. ప్రస్తుత సారథి కమ్మిన్స్ గైర్హాజరీలో తప్పనిసరి పరిస్థితుల్లో స్మిత్ కు కెప్టెన్సీ ఇస్తున్నారు. అలా ఓ వెలుగు వెలిగిన స్మిత్ కెరీర్ మసకబారింది. ఇక విరాట్ కోహ్లి 2014 తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్సీ చేపట్టాడు. కానీ, 2021 చివరకు వచ్చేసరికి అతడి సారథ్యమూ పోయింది.

టి20లకు మాత్రమే కెప్టెన్సీ వదిలేస్తానని కోహ్లి అనడం.. వన్డే కెప్టెన్సీ కూడా త్యాగం చేయాలని బోర్డు కోరండం, ఆ సందర్భంగా వివాదం రేగడం, చివరకు దక్షిణాఫ్రికా సిరీస్ అనంతరం అతడు టెస్టు కెప్టెన్సీ వదిలేయడం అంతా వేగంగా జరిగింది. ఇక రూట్ 2017లో ఇంగ్లండ్ పగ్గాలు చేపట్టి నాలుగేళ్లు బాగానే నడిపాడు. అత్యధిక విజయాలతో గొప్ప సారథిగా నిలిచిపోయాడు. కానీ.. నిరుడు జట్టు ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ ను దారుణంగా 4-0తో కోల్పోవడంతో కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. ఇక తాజాగా కివీస్‌ టెస్టు కెప్టెన్సీకి కేన్‌ విలియమ్సన్ గుడ్‌బై చెప్పాడు.

నూతన సారథిగా పేస్ బౌలర్ టిమ్‌ సౌథీని ప్రకటించారు. కాగా, భారత్‌లోనూ అభిమానులున్న అతికొద్ది మంది అంతర్జాతీయ ఆటగాళ్లలో విలియమ్సన్‌ ఒకడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు ఆటగాడిగా, కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే,ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో న్యూజిలాండ్ కెప్టెన్ గా ఉన్న అతడు టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. 2023 వన్డే ప్రపంచ కప్‌తో పాటు 2024 టీ20 ప్రపంచ కప్‌లో కెప్టెన్ గా జట్టును నడిపించనున్నాడు. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సందర్భంగా కేన్‌ విలియమ్సన్‌ ప్రకటన విడుదల చేశాడు. ''పని భారం నిర్వహణలో భాగంగా కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకొన్నా.

క్రికెట్ బోర్డుతో చర్చించా'' అని వెల్లడించాడు. కాగా, ఆరేళ్ల కిందట బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ నుంచి కేన్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అతడి నాయకత్వంలో న్యూజిలాండ్‌ 2021 టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత్‌పై విజయం సాధించింది. మొత్తం 38 టెస్టుల్లో కెప్టెన్ గా వ్యవహరించి 22 విజయాలను సాధించిపెట్టాడు.67 ఏళ్లలో తొలి సారి పేసర్ సారథి న్యూజిలాండ్‌కు ఓ స్పెషలిస్ట్‌ ఫాస్ట్‌ బౌలర్‌ టెస్టు సారథిగా రావడం ఇది రెండోసారి. 1955లో హారీ కేవ్‌ కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఇకపై టిమ్‌ సౌథీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. డిసెంబరు 26 నుంచి పాకిస్థాన్‌తో ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌కు సౌథీ కెప్టెన్‌. విలియమ్సన్ గైర్హాజరీలో 22 టీ20ల్లో సారథ్యం వహిస్తున్న సౌథీ..టెస్టులకు కెప్టెన్సీ చేపట్టడం మాత్రం ఇదే తొలిసారి. కెరీర్‌లో అతడు 88 టెస్టులు, 151 వన్డేలు, 107 టీ20లను టిమ్‌ సౌథీ ఆడాడు. కాగా, న్యూజిలాండ్ దిగ్గజ పేస్ ఆల్ రౌండర్ రిచర్డ్ హ్యాడ్లీకి కూడా సాథ్యం కానిది సౌథీకి దక్కడం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.