Begin typing your search above and press return to search.

ట్రంప్ నో చెప్పిన ప‌ర్లే..యూరప్ పిలుస్తోంది

By:  Tupaki Desk   |   23 Feb 2017 6:09 AM GMT
ట్రంప్ నో చెప్పిన ప‌ర్లే..యూరప్ పిలుస్తోంది
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బి వీసాలపై ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతూ ఉండడం భారతీయ ఐటీ నిపుణులకు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఐరోపా దేశాలు భారతీయ ఐటీ నిపుణులకు తలుపులు బార్లా తెరుస్తామంటూ ప్రకటిస్తూ ఉన్నాయి. మరింత ఎక్కువ మంది భారతీయ ఐటి నిపుణులను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఐరోపా యూనియన్ ప్రకటించడమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యంలో ఏ రూపంలోనైనా రక్షణాత్మక ధోరణులు కొనసాగడం సరికాదని స్పష్టం చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌ లో ఉన్న ఇయు- భారత్ వాణిజ్య - పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి చర్చలను తిరిగి ప్రారంభించడానికి ఇరుపక్షాలు విఫలం కావడంపై మన దేశంలో పర్యటిస్తున్న ఇయు పార్లమెంటులో విదేశీ వ్యవహారాల కమిటీ ప్రతినిధి బృందం బుధవారం విచారం వ్యక్తం చేసింది.

విదేశీ వ్యవహారాలపై ఏర్పడిన యూరోపియన్‌ పార్లమెంట్‌ కమిటీ ప్రతినిధి బృందం భారత్‌ లో రెండోసారి పర్యటిస్తోంది. ఈ సందర్భంగా ఢిల్లీలో అధికారులతో సమావేశమైంది. దీర్ఘకాలంగా పెండింగ్‌ లో వున్న ఇయు-భారత్‌ వాణిజ్య - పెట్టుబడి ఒప్పందంపై చర్చలను పునరుద్ధరించడంలో విఫలమైనందుకు విచారం వ్యక్తం చేసింది. అమెరికాలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అనుసరిస్తున్న రక్షణ వాద విధానాన్ని విమర్శించింది. యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధి బృందానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డేవిడ్‌ మెక్‌ ఆలిస్టర్‌ మాట్లాడుతూ మరింత మంది భారతీయ వృత్తి నిపుణులకు తమ దేశంలో అనుమతిస్తామన్నారు. భారత్‌ నుంచి వృత్తి నిపుణులను తీసుకోక పోతే తమ దేశంలో ఐటి రంగం అభివృద్థి చెందదని అన్నారు. ఇయు- భారత్‌ల మధ్య విస్తృత స్థాయి వాణిజ్య పెట్టుబడి ఒప్పందం (బిటిఐఎ) చర్చలను త్వరగా పునరుద్ధరించడంపై ఒత్తిడి తేవాలన్నారు. రెండు వైపులా వాణిజ్యానికి ఈ ఒప్పందం ప్రాధాన్యతనిస్తున్నందున చర్చలు పునరుద్ధరించాలని భారత్‌కు ఇయు ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/