Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై అజమాయిషీ ఉందంటూ ఈటెల సంచలనం

By:  Tupaki Desk   |   3 Feb 2021 9:45 AM IST
కేసీఆర్ పై అజమాయిషీ ఉందంటూ ఈటెల సంచలనం
X
తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ సీనియర్ నేత.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ ఇటీవల కాలంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కేటీఆర్ చేతుల్లోకి వెళుతుందన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతేకాదు.. టీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆజమాయిషీ చేసే అధికారం తనకు ఉందన్న ధీమాను వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలోని వావిలాల గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన ఆయన.. భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ తో తనకు ఇరవై ఏళ్ల అనుబంధం ఉందన్న ఈటెల.. ‘ఇన్నేళ్ల అనుబంధంలో నాకు కేసీఆర్ పై అజమాయిషీ ఉంది. రైతులు ఏమనుకుంటున్నారో చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆరేళ్ల కాలంలో కేసీఆర్ అనేక సమావేశాల్ని నిర్వహించింది కేవలం వ్యవసాయం మీద మాత్రమే’’ అని గుర్తు చేశారు. పార్టీలు ఉండకపోవచ్చు.. జెండాలు ఉండకపోవచ్చు.. ప్రజల పక్షాన ఎప్పుడూ తాను ఉంటానన్న ఆయన..‘‘ఆరుసార్లు మీ బిడ్డగా ఆదరించి గెలిపించారు. మీ గౌరవాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తాను. వ్యవసాయం.. నీళ్ల మీద అనేకసార్లు కేసీఆర్ మీటింగ్ పెట్టారు. తెలంగాణ జయించింది విద్యుత్ కోతలను మాత్రమేనని అందరూ గుర్తు పెట్టుకోవాలి’’ అని చెప్పారు.

కేసీఆర్ మనస్తత్వం తనకు తెలుసని.. వ్యవసాయ రంగంలో తెలంగాణ నంబర్ వన్ గా ఉండాలన్నది ఆయన కోరికగా చప్పారు. ఈ రోజున కేసీఆర్ ఉన్నా లేకున్నా.. తాను మంత్రిగా ఉన్నా లేకున్నా రైతులకు అండగా ఉంటామన్నారు. దేశం మొత్తానికి అన్నం పెట్టే సత్తా తెలంగాణకు ఉందని.. రాష్ట్రలన్నీ నేడు తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. దేశానికి వెన్నుముకగా ఉన్న రైతులకు ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు. కేసీఆర్ మీద అజమాయిషీ.. పదవి ఉన్నా లేకున్నా లాంటి మాటలు ఈటెల నోటి నుంచి రావటం ఆసక్తికరంగా మారాయి. తాము పదవుల్లో లేకున్నా.. రైతులకు అండగా ఉంటామని చెప్పటం చూస్తే.. కేటీఆర్ సొంత టీంతో ముందుకు వెళ్లనున్నారా? అన్న కొత్త చర్చకు ఈటల తెర తీశారని చెప్పక తప్పదు.