Begin typing your search above and press return to search.

ఈటల రాజీనామా వాయువేగంలో ఆమోదించారెందుకు?

By:  Tupaki Desk   |   13 Jun 2021 9:30 AM GMT
ఈటల రాజీనామా వాయువేగంలో ఆమోదించారెందుకు?
X
తెలంగాణలో రాజకీయం రాజుకుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో.. ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే.. ఆయన తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు పంపిన కాసేపటికే దానిని ఆమోదించటం.. ఆ వెంటనే హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీగా ఉందన్న గెజిట్ జారీ కావటం చకచకా జరిగిపోయాయి. ఇంత వేగంగా ఎందుకు జరిగింది. చాలా సందర్భాల్లో స్పీకర్ కు ఏదైనా లేఖ పంపినప్పుడు దానిపై నిర్ణయాన్ని తీసుకోవటానికి కాసింత సమయం తీసుకుంటారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రం వెంటనే ఆమోదం పలుకుతారు. స్పీకర్ ఓకే చేసిన తర్వాత ప్రభుత్వం గెజిట్ జారీ చేయటానికి మాత్రం కాస్త సమయం తీసుకుంటారు.

అందుకు బదులుగా ఈటల రాజీనామా విషయంలో మాత్రం అన్ని పనులు చకచకా పూర్తి కావటం.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఖాళీగా ఉన్న విషయాన్ని నివేదించటం జరిగిపోవటానికి అసలు కారణం వేరే ఉందని చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావటం తెలిసిందే. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్నికల సంఘం.. ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎన్నికలు నిర్వహించటం ఏమిటన్న మాట వినిపించింది. ఈ నేపథ్యంలో తర్వాత జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల్నినిలిపివేశారు.

సాధారణంగా ఉన్న నిబంధన ప్రకారం ఏదైనా అసెంబ్లీ.. లోక్ సభ స్థానం ఖాళీ అయితే.. దాన్ని ఆర్నెల్ల లోపు భర్తీ చేయాల్సి ఉంటుంది. జూన్ లో ఖాళీ అయితే.. డిసెంబరు లోపు ఎప్పుడైనా భర్తీ చేయొచ్చు. అయితే.. రానున్న రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ అన్న అంచనాలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టటం.. పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తివేత దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత మారుతుందని.. ఈ జనవరి.. ఫ్రిబవరిలో మాదిరి పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నారు.

సెప్టెంబరు మధ్యలో కానీ అక్టోబరులో కానీ థర్డ్ వేవ్ వస్తుందన్న అంచనాల నేపథ్యంలో.. ఏం చేసినా జులై.. ఆగస్టుల్లోనే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నిక.. షెడ్యూల్ ప్రకారం జరగాల్సి ఉన్నా.. సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఎమ్మెల్సీ ఎన్నికలు.. స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ఈ రెండు నెలలే అవకాశం ఉంది. దీంతో.. ఎలాంటి ఆలస్యం కాకుండా ఉండేందుకే ఈటల రాజీనామా వెంటనే గెజిట్ ను జారీ చేయటంతో పాటు.. కేంద్ర ప్రభుత్వ నోటీసుకు పంపినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలోని కీలక వర్గాల అంచనా ప్రకారం..రానున్న రెండు నెలల్లోనే హూజురాబాద్ ఉప ఎన్నిక జరిగే అవకాశమే ఎక్కువ అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.